ఆత్మహత్యలపై సభలో సమరమే
కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయం
* అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
* స్పీకర్, మండలి చైర్మన్‌పై అవిశ్వాసానికి యోచన
* సమావేశాలు 20 రోజులు జరపాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు, కరవుపై చర్చించేదాకా శాసనసభలో పట్టుబట్టాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నిర్ణయించింది. మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో సీఎల్పీనేత కె.జానారెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు సమావేశమయ్యారు.
శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 23న ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో అందులో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు 4 గంటలపాటు చర్చించారు. రైతు ఆత్మహత్యలు, కరవును పట్టించుకోకపోవడం, ప్రత్యామ్నాయ వ్యవసాయవిధానం ప్రకటించకపోవడం, వాటర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, సబ్‌ప్లాన్ అమలులో నిర్లక్ష్యం, పార్టీ ఫిరాయింపులు వంటివాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.
ఎన్నో ప్రజా సమస్యలున్నందున సమావేశాలను నాలుగైదు రోజులకే పరిమితం చేయకుండా కనీసం 20 రోజులపాటు నిర్వహించేలా కోరాలని నిర్ణయించారు. రైతు ఆత్మహత్యలపై, కరవుపై చర్చించాలని శాసనసభ మొదటిరోజున వాయిదా తీర్మానం ఇస్తామని, దీనిపై చర్చించేదాకా సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని నిర్ణయించినట్టుగా ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు.
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలుచేయకుండా, కోర్టు నోటీసులను తీసుకోకుండా ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్న స్పీకరుపై, శాసనమండలి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీలకు మూడెకరాల భూపంపిణీలో వైఫల్యం వంటివాటిపైనా చర్చకు పట్టుపడతామన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలుకోసం మండల రెవెన్యూ, ఆర్డీఓ, కలెక్లర్ల కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని తెలిపారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులా?
మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై సీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్ష ఎమ్మెల్యేపై అధికారపక్షానికి చెందిన గువ్వల బాలరాజు దాడిచేయడం, ఆ మరునాడే ఆ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు తీసుకుపోవడంపై మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో భద్రాచలం, దుమ్ముగూడెం, గిరిజన ఆదివాసీలు ముంపుబారిన పడకుండా డిజైను మార్చాలంటూ అసెంబ్లీ మొదటి సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినా పట్టించుకోవడం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
ముఖ్యమైన ఈ అంశంపై జానారెడ్డితో సహా సీనియర్ ఎమ్మెల్యేలెవరూ సరైన రీతిలో స్పందించడం లేదని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెబుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఆధ్వర్యంలో నిర్మాణం జరిగేలా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ను, ప్రధానిని, అధిష్టానాన్ని కలుస్తానని చెప్పారు. చాలా అంశాల్లో వ్యతిరేకత మూ టగట్టుకున్న ప్రభుత్వాన్ని రైతు వ్యతి రేక ప్రభుత్వంగా ఈ శాసనసభ సమావేశాల్లో నిరూపిం చాలని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సూచించారు.
జానా తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం
ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపై సీఎల్పీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు రీడిజైన్లపై అధ్యయనం చేసిన తరువాతే అభిప్రాయాలు చెబితే బాగుంటుందన్న సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిజైన్ల మార్పును వ్యతిరేకించాల్సిందేనని, దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని జీవన్‌రెడ్డితో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాగం రంగారెడ్డి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టుల డిజైన్లను మార్చడాన్ని సభలో గట్టిగా వ్యతిరేకించాలని వారు కోరారు. శాసనసభ్యుల సూచనలు, కోరిక మేరకే నడుచుకుంటానని, ప్రభుత్వాన్ని నిలదీసే వారికి మద్దతుగా ఉంటానని వాదనల తరువాత జానా చెప్పారు. సీఎల్పీ నాయకునిగా మద్దతు ఇవ్వడానికే పరిమితం కాకుండా, సభ్యులకు నాయకత్వం వహిస్తూ ప్రభుత్వంపై పోరాడాలని జీవన్‌రెడ్డి సూచించారు.