అసెంబ్లీ హాలులో సీట్ల కుదింపు
డిజైన్‌పై అన్నిపక్షాలతో స్పీకర్ చర్చలు 160-165 కుర్చీలకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో సీట్ల సంఖ్యను కుదించనున్నారు. భవిష్యత్‌లో పెరగబోయే స్థానాలను దృష్టిలో పెట్టుకుని 160-165 వరకు వీటిని కుదించాలని నిర్ణయించారు. దీనిపై బుధవారం స్పీకర్ మధుసూదనాచారి అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో చర్చించారు. అంతకుముందు ఇదే అంశంపై జి,చిన్నారెడ్డి (కాంగ్రెస్), అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సున్నం రాజయ్య (సీపీఎం) తదితరులతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చర్చించారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో 300 సీట్లు ఉన్నాయి. రాష్ర్టం విడిపోయాక ఏపీ శాసనసభ సమావేశాల నిర్వహణకు మరో హాలును కేటాయించగా, తెలంగాణ శాసనసభ సమావేశాలను పాత హాలులోనే నిర్వహిస్తున్నారు. అయితే, తెలంగాణ శాసనసభలో సభ్యుల సంఖ్య 120 మాత్రమే (ఆంగ్లో ఇండియన్ సభ్యునితో కలిపి).
దీంతో తెలంగాణ శాసనసభ్యులు మొత్తం హాజరైనా హాలులోని సగం సీట్లు కూడా నిండడం లేదు. స్పీకర్ స్థానం నుంచి చూసినా, గ్యాలరీ నుంచి చూసినా హాలులో సీట్లన్నీ ఖాళీగా, బోసిగా కన్పిస్తున్నాయి. ఈ కారణంగా హాలులో సీట్ల సంఖ్యను సభ్యుల సంఖ్యకు అనుగుణంగా కుదించాలని స్పీకర్ నిర్ణయించారు. ప్రస్తుతానికి శాసనసభలో 120, మండలిలో 40 స్థానాలుండడం వల్ల ఉభయసభల సమావేశానికి కూడా కుదించిన సీట్లు ఈ నాలుగేళ్లపాటు సరిపోతాయని స్పీకర్ భావిస్తున్నారు. కొత్త సంఖ్యకు అనుగుణంగా డిజైన్లను రూపొందించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌శర్మను స్పీకర్ ఆదేశించారు. వీలైనంత త్వరగా డిజైన్లు తయారు చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త సీట్ల ఏర్పాటును పూర్తిచేయాలని సూచించారు. సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో సీట్లను ఇంకా సౌకర్యవంతంగా రూపొందించాలని ఆదేశించారు.