మోగిన నగారా
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించటంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. మరోవైపు.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది.
10 అసెంబ్లీ.. 3 ఎంపీ స్థానాలకు..
జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, అరకు లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం జిల్లాలోనే పూర్తిగా ఉండగా.. కొన్ని మండలాలు విజయనగరం, అరకు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 19.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 9వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో నమోదైనవారు కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందడుగు..
జిల్లాలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో పూర్తి స్థాయి సందడి నెలకొంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ముందుంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తుండగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు నిరాశానిస్పృహల్లో ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితులు నెలకొనటమే దీనికి కారణం.
ఇదీ షెడ్యూల్ : ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 19, ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 23న నామినేషన్ల ఉపసంహరణ, మే 7న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు