ఇదేమి రచ్చబండ
సాక్షి, గుంటూరు :‘రచ్చబండ’ పేరుతో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తూ పూర్తయిందనిపిస్తున్నారు.తాత్కాలిక రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీకి నేతలు,అధికారులు పరిమితమవుతున్నారు. రైతులను, వారి సమస్యలను పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణం, కొలకలూరు పంచాయతీలో గురువారం నిర్వహించిన రచ్చబండకు నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రజాస్పందన లేకుండానే రచ్చబండను మమ అనిపించారు. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి పాల్గొని కొందరు లబ్ధిదారులకు తాత్కాలిక రేషన్‌కార్డులు పంపిణీ చేసి ముగించారు. అంతకు ముందు ప్రసంగిస్తూ తాను సమైక్యవాదినంటూ, రాష్ట్ర సమైక్యతకు పోరాడుతున్నానంటూ చెప్పుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదు.
కనీసం, ఇటీవల అధికవర్షాలకు పంటనష్టపోయిన విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. వినుకొండ రూరల్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు రేషన్ సరకుల సమస్యపై అధికారులను చుట్టుముట్టారు. కార్డులు వున్నా రేషన్ ఇవ్వడంలేదని వివరించారు. దీనికి స్పందించిన అధికారులు సర్వర్‌లో కార్డుల డేటా మాయమైందని, హైదరాబాద్ నుంచి ఇంజినీర్లను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు. పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లో శుక్రవారం జరగాల్సిన రచ్చబండను పలు కారణాల నేపథ్యంలో వాయిదా వేశారు.