అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశీలించిన స్పీకర్
హైదరాబాద్ : శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ బుధవారం అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశీలించారు. అసెంబ్లీకి విభజన బిల్లు రానున్న నేపథ్యంలో సమావేశాల ఏర్పాటుపై స్పీకర్ కసరత్తు చేపట్టారు. అధికారులతో సమావేశమై అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. కాగా అసెంబ్లీని ప్రొరోగ్ చేసినప్పటికీ డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగి తీరుతాయని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు డిసెంబర్ ఒకటి రెండు తేదీలలోనే రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు వస్తే ఏ క్షణంలోనైనా స్పీకర్ అసెంబ్లీని సమావేశపరచవచ్చనే అంచనాతో పోలీస్ అధికారులున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నాలుగు ఐదు తేదీలలో అసెంబ్లీ సమావేశం పెట్టినా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదే సందర్భంలోనే స్పీకర్ పోలీస్ అధికారులతో సమావేశమవ్వడమూ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా సహజంగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ముందు పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ సంప్రదింపులు జరుపుతుండడం తెలిసిందే.