సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న సమావేశమైన శాసనసభ, శాసనమండలి ఇటీవలి కాలంలో మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఉ«భయ సభలు ప్రారంభమైన వెంటనే.. శుక్రవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో తీసుకున్న నిర్ణయాలను సమర్పిస్తారు.
అనంతరం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 2018–19 వార్షిక నివేదికను ఉభయ సభలకూ సమర్పిస్తారు. ఆదిలాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో కొన్ని గ్రామాల విలీనానికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ పత్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమర్పిస్తారు. ఇక తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021, కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టీకల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2021 శాసనసభ ముందుకు రానున్నాయి.
అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2021, నల్సార్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2021 కూడా ప్రస్తావనకు వస్తాయి. కాగా సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment