అసెంబ్లీకి గతంలో కంటే ఎక్కువ భద్రత: సీపీ
హైదరాబాద్ : శాసనసభ భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్తో డీజీపీ ప్రసాదరావు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీకి గతంలో కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరిస్తామని ఆయన తెలిపారు. సమావేశాల సమయంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విభజన బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
ఇక అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు మించి నిర్వహించకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన ఈ నెల 12న (గురువారం) అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి 15న (శనివారం) ముగించాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. విపక్షాలు గట్టిగా పట్టుపడితే మరో రోజు (అవసరమైతే ఆదివారం కూడా సభను కొనసాగించేలా) పొడిగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్వల్పకాల వ్యవధిలోనే విభజన బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది