జానారెడ్డి ఆస్తుల కేసులో చర్యలు తీసుకోండి
రాష్ట్ర హోంశాఖ, డీజీపీలకు కేంద్ర హోంశాఖ లేఖ
విచారణకు సిద్ధం: జానారెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందిం చింది. మంత్రిగా ఉంటూ జానారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, బంధువుల పేర్ల మీద పలు సంస్థలు స్థాపించి వాటిలోకి అక్రమ ఆదాయాన్ని మళ్లించారని పేర్కొంటూ గత జూలైలో టీడీపీ నేత తేరా చిన్నపరెడ్డి కేంద్ర హోం, కార్పొరేట్ వ్యవహారాల శాఖలతోపాటు రిజర్వ్‌బ్యాంక్, సెబి, సీవీసీ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ సంస్థలకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర హోం శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ గత నెల 29న రాష్ట్ర హోంశాఖ, డీజీపీలకు లేఖ రాసింది.
ఇది తాజాగా రాష్ర్ట ప్రభుత్వానికి అందింది. వాస్తవానికి ఇవే ఆరోపణలతో గతంలో ‘ఫోరం ఫర్ పీపుల్ మూమెంట్ ఎగెనైస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్స్’ సంస్థ కన్వీనర్ వీవీ రావు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తొలుత సరైన ఆధారాలతో దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలు, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన లేఖపై జానారెడ్డి స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ‘ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు’అని చెప్పారు.
4.