ఆయన అహంకారమేంటో అర్థం కావడం లేదు: కేసీఆర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దని.. అభ్యర్థి గుణగణాలు కూడా చూడాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(రెండో విడత సభలు)కు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘‘మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి పూర్తిస్థాయిలో రాలేదు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెబుతున్నాయి. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల్లో మంచి చెడులను ఆలోచించాలి. ఎన్నికలు నేతలు కాదు.. ప్రజలే గెలవాలి. పార్టీ వెనుక ఉన్న చరిత్ర కూడా చూడాలి..
.. తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?. 2004లో ఇవ్వాల్సిన తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గతంలో రైతుల్ని ఆదుకోవాలని ఏ ప్రభుత్వం అనుకోలేదు. గతంలో కరెంట్ ఉండేది కాదు.. వలసలు పోయి బతికేవారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా బీజేపీ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదు..
..బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గమనించండి. ఎలాంటి అలజడులు లేకుండా రాష్ట్రం క్రమబద్ధంగా ముందుకు పోతోంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తోంది. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తోంది. నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా.. రైతుల కోసం రైతు బంధు తీసుకొచ్చాం. రైతు చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షలను వారంలోనే చెల్లిస్తున్నాం. ధరణితోనే రైతు బంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం. అలాంటిది ధరణిని తీసేయాలంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది’’.. అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన.
‘‘..పీసీసీ అధ్యక్షుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్‌చాలని అంటున్నారు. మూడు గంటల కరెంట్‌తో ఎకరానికి నీరు పారుతుందా? ఆయన అహంకారం ఏంటో అర్థం కావడం లేదు. 24 గంటల కరెంట్ కావాలా? 3 గంటల కరెంట్ కావాలా?. కాంగ్రెస్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అధికారం ఇస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తారు’’ అని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు
బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పినపాక నియోజకవర్గంలో గిరిజనులు, దళిత వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారి బతుకులు ఏమాత్రం బాగాలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు. ఎన్నో సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇవాళ తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీ అందరికి కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నాటికి అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. వారిలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ధరణి ఉండటం వల్ల ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే పడుతున్నాయి. ధరణి ఉండాలో.. వద్దో.. ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ నేతల గోల్మాల్ మాటలు నమ్మి మోసపోవద్దు’’ అని కేసీఆర్ సూచించారు.
దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ..
నర్సంపేట సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దేశం లేదా రాష్ట్రాలు అభివృద్ధిలో ఎక్కడ ఉన్నాయి అనేది నిర్ణయించే వాటిలో తలసరి ఆదాయం ముఖ్యమైనది. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో మనం 18వ స్థానంలో ఉండేవాళ్లం. ఇవాళ మనం అగ్రస్థానంలో ఉన్నాం. ఇదే కాదు.. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. మనం ఇప్పుడు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. మరో 2 ప్రాజెక్టులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేస్తే నాలుగు కోట్ల టన్నుల ధాన్యం పండించేందుకు వీలుంటుంది. అప్పుడు దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరిస్తుంది’’ అని కేసీఆర్ అన్నారు.