పాదయాత్రకు రోజా పరిమళం
ఎనిమిదో రోజు ఆత్మగౌరవ యాత్రలో రోజా జోష్ కనిపించింది. విశాఖకు రైల్వేజోన్ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మగౌరవ యాత్ర గురువారం నగరంలోని వేమన మందిరం వద్ద ప్రారంభమై రాత్రి చినగదిలిలో ముగిసింది. కాగా మధ్యాహ్నం నుంచి పాదయాత్రలో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యే రోజా సుమారు 12 కిలోమీటర్లు అమర్నాథ్ తదితరులతోపాటు నడిచి పాదయాత్ర బృందంతోపాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో ఉత్సాహం నింపారు.
విశాఖపట్నం : ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల మాదిరిగా ఆత్మగౌరవయాత్రలో జనకెరటం ఎగసి పడింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో కలిసి పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా పాదయాత్ర చేయగా వెల్లువలా కదంతొక్కింది. వారి అడుగులో అడుగు వేస్తూ పదం కలిపింది. రైల్వేజోన్ కోసం అమర్నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర గురువారం 8వ రోజుకు చేరుకుంది. తొలుత ఉదయం ఆశీల్‌మెట్ట వద్ద వేమన మందిరం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన అమర్ సంపత్‌వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడ నుంచి సిరిపురం జంక్షన్, ఏయూ ఔట్‌గేట్, చినవాల్తేరు, పెదవాల్తేరు జంక్షన్, శివాజీపార్కు, కళాభారతి, మద్దిలపాలెం జంక్షన్, తెలుగుతల్లి విగ్రహం సమీపంలోని తూర్పు కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యాలయం వరకు సాగింది. చినవాల్తేరు, పెదవాల్తేరు, శివాజీ పార్కు పరిసర ప్రాంతాల్లో ప్రజలు అమర్నాథ్కు బ్రహ్మరథం పట్టారు. భోజన విరామనంతరం అమర్‌కు పార్టీ ప్రొగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా సంఘీభావం తెలిపారు.
వామపక్షాల సంఘీభావం
సాయంత్రం ఐదు గంటలకు వంశీకృష్ణ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మద్దిలపాలెం జంక్షన్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోగా అక్కడ సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్, నగర కార్యదర్శి మార్కెండేయులు తదితరులు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. జాతీయ రహదారి నుంచి కృష్ణా కళాశాల మీదుగా హెచ్‌బీ కాలనీ వరకు సాగింది. అక్కడ జరిగిన సభలో రోజాతో పాటు అమర్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు ప్రసంగించారు. రైల్వేజోన్ విషయంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆడుతున్న నాటకాలపై దుమ్మెత్తి పోశారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు మద్యం బ్రాండ్స్ తప్ప రైల్వేజోన్ గురించి తెలియదన్నారు. బ్యాంకులకు వందల కోట్లు బురిడి కొట్టిన గంటా ఏనాడు జోన్ కోసం మాట్లాడలేదంటూ చురకలేశారు. అయ్యన్నకు ఏజెన్సీలో బాక్సైట్, గంజాయి సాగుపై శ్రద్ధ తప్ప ఈ ప్రాంత సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు.
అనంతరం పాత వెంకోజీపాలెం, వెంకోజీపాలెం, ఎంవీపీ డబుల్ రోడ్, గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి, అప్పుఘర్, తెన్నేటి పార్కు, జోడుగుళ్లపాలెం, హనుమంత వాక జంక్షన్ మీదుగా చినగదిలిలోని వంశీ కళాశాల వరకు పాదయాత్ర సాగింది. ఎనిమిదోరోజు 17 కిలోమీటర్ల నడిచిన అమర్ ఇప్పటివరకు 123 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేయగలిగారు. మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయకుమార్, కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, రాష్ట్ర మహిళా విభాగం ఉత్తరాంధ్ర ఇన్చార్జి వరుదు కళ్యాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి కాంతారావు, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, మహిళ, ఎస్సీవిభాగాల అధ్యక్షులు పసుపులేటి ఉషాకిరణ్, బోని శివరామకృష్ణ, నగర అధికార ప్రతినిధి మూర్తియాదవ్, తదితరులు పాల్గొన్నారు.
11.5 కిలోమీటర్లు నడిచిన రోజా..
అనంతరం అమర్‌తో కలసి రోజా ఆత్మగౌరవయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఏమాత్రం విరామం లేకుండా 11.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మద్దిపాలెం వంశీకృష్ణ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర చినగదిలి వంశీకి చెందిన కళాశాల వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్లకిరువైపులా బారులు తీరిన జనం జోన్ కోసం నినదించారు. పలుచోట్ల రోజాతో కరచాలనం చేసేందుకు అమర్‌ను అభినందించేందుకు పోటీపడ్డారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ ఆశీర్వదించారు.
మంత్రులకు పట్టదా?
పెదవాల్తేరు : జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఏనాడు రైల్వే జోన్, ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పాపానపోలేదని, ఈ ప్రాంత అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా దుయ్యబట్టారు. హెచ్‌బీకాలనీలో వార్డు మాజీ కార్పొరేటర్ నడింపల్లి కృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎంతసేపు గిరిజన ప్రాంతంలో ఉన్న బాౖMð్సట్, గంజాయి సాగుపైన శ్రద్ధ తప్పితే ప్రజల మనోభావాలు అవసరంలేదన్నారు. మంత్రి గంటాకు ఎప్పడు నారాయణ స్కూల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చేందుకు పేపర్ లీకేజీలు, భూకుంభకోణాలే తప్పా ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి కృషి చేయడంలేదని మండిపడ్డారు. ఎంత సేపు నేను సీనియర్ని, చాలా గొప్పవాడిని అని చెప్పుకునే అశోక్‌గజపతిరాజు విభజన చట్టంలో పేర్కొన్న రైల్వేజోన్ గురించి ఎందుకు నోరు మోదపడంలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసులు చిరకాల ఆకాంక్ష అయిన రైల్వేజోన్ కోసం వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందన్నారు.
జోన్ సాధించి తీరుతాం
అడుగడుగునా ప్రజలు చూపిస్తున్న ఆదరణ అభిమానాలు చూస్తుంటే రైల్వేజోన్ సాధించి తీరుతామని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజ ల కోసం చేస్తున్న పోరాటానికి తన వంతు సహకారం అందించిన రోజా ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారన్నారు. జోన్ సాధన కోసం చేపట్టిన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావడం శుభపరిణామమన్నారు.