భర్తను అంతమొందించిన కేసులో భార్య అరెస్టు
అట్లూరు : అల్లుడుతో అక్రమ సంబంధం నెరుపుతూ తాళికట్టిన భర్తనే అడ్డుగా భావించి చివరకు భర్తను అంతమొందించిన కేసులో భార్య నాగసుబ్బమ్మతో పాటు అల్లుడి బంధువు పాలకొండయ్యను అరెస్టు చేసినట్లు సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బద్వేలు సీఐ రామాంజినాయక్, స్థానిక ఎస్ఐ మహమ్మద్రఫిలు పేర్కొన్నారు. వారి వివరాల మేరకు రెడ్డిపల్లె గ్రామానికి చెందిన డబ్బుగొడ్లవెంకటయ్య, ఆయన భార్య నాగసుబ్బమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారన్నారు. రెండవ కుమార్తెను ఒంటిమిట్ట మండలం అమ్మోరుపల్లెకు చెందిన వెంకటశేషయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అయితే నాగసుబ్బమ్మ కూతురికి పెళ్ళి అయినప్పటి నుండి అల్లుడు వెంకటశేషయ్యతో అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డుగా భావించిన భర్తను ఎలాగైనా అంతమొందించాలని కసికట్టింది. అయితే అల్లుడిని కువైట్కు పంపించి భర్తను అంతమొందించి తాను కువైట్కు వెళ్ళి అల్లుడితో సహజీవనం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అల్లుడిని కువైట్కు పంపించింది. ఈ నెల 4వ తేదీన ఒంటిమిట్ట మండలం అమ్మోరుపల్లెకు చెందిన అల్లుడి సమీప బంధువు పాలకొండయ్యను పురమాయించుకుని అల్లుడి ఆదేశాల మేరకు సోమశిల ముంపు ప్రాంతమైన చెండువాయి గ్రామ సమీపాన యల్లమ్మ ఆలయం వద్దకు భర్త వెంకటయ్యను తీసుకెళ్ళి మద్యం తాపించి బండరాళ్ళతో తలపై కొట్టి ఆపై వెంట తీసుకెళ్ళిన కత్తితో గొంతు కోసి నడుముకు, కాళ్ళకు రాళ్ళు కట్టి అక్కడ ఉన్న ఓ బావిలో పడేసి వచ్చారన్నారు. గొర్రెల కాపరులు బావిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం ఇవ్వడంతో ఈ నెల 12వ తేదీ బావి వద్దకు వెళ్ళి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టాలన్నారు. విచారణలో భార్యే భర్తను అంతమొందించిందని తేలిందని, ఆమెతో పాటు అల్లుడి బంధువు పాలకొండయ్యను సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు మంగళవారం వారిరువురిని కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. అయితే అల్లుడు వెంకటశేషయ్యను కూడా త్వరలోనే కువైట్ నుండి రప్పించి అరెస్టు చేస్తామని తెలిపారు.