atm cash
-
మరో ఏటీఎం.. నోట్ల వర్షం
ఏటీఎంలకు ఏమైందో తెలియదు గానీ.. నోట్ల వర్షం కురిపిస్తున్నాయి. నిన్న కాక మొన్న రాజస్థాన్‌లోని టోంక్ ప్రాంతంలో ఇలా జరిగితే, ఇప్పుడు తాజాగా అసోంలోని జమునాముఖ్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఏటీఎం కూడా కోరిన దాని కంటే నాలుగు రెట్ల మొత్తాన్ని ఇచ్చింది. ఏం జరుగుతోందో ఆ బ్యాంకు అధికారులకు తెలిసే సమయానికి.. ఏడు లక్షల రూపాయల మొత్తాన్ని జనం లాగేసుకున్నారు. ఆ ఏటీఎం ఉదారత్వం గురించి ఆనోటా ఈనోటా తెలిసిన జనం.. అక్కడకు వెళ్లి తమ ఖాతాలో ఉన్న మొత్తాన్ని డ్రా చేసుకోడానికి ప్రయత్నిస్తే, దానికి నాలుగు రెట్ల మొత్తం వచ్చింది. సిస్టం ఎర్రర్ కారణంగా ఇలా జరిగిందని యూబీఐ జమునాముఖ్ బ్రాంచి మేనేజర్ కృష్ణ భౌమిక్ తెలిపారు. ఏటీఎంలోని స్లాట్లలో 500, 1000, 2000 రూపాయల నోట్లు పెట్టామని, ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు కావాలని అందులో ఎంటర్ చేస్తే.. రెండు 500 రూపాయల నోట్లకు బదులు రెండు 2000 రూపాయల నోట్లు వచ్చాయని ఆయన వివరించారు. విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపినా, అధికారికంగా మాత్రం ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. ఫిర్యాదు చేయాలా వద్దా అన్న విషయమై స్పష్టత కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని భౌమిక్ చెప్పారు. ఎవరెవరు ఎంతెంత మొత్తం తీసుకున్నారో అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాళ్ల నుంచి వారివి కాని డబ్బులు కూడా వెనక్కి తీసుకుంటామని తెలిపారు. -
ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి..
హైదరాబాద్: ఓ వైపు తీవ్ర కరెన్సీ కష్టాలతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు కాస్తుంటే.. మరో వైపు ఏటీఎం మెషిన్లలో డబ్బు నింపే ఏజెన్సీలో పనిచేసే వారు చేతివాటం ప్రదర్శించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి వీరు స్వప్రయోజనాలకోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 85 లక్షల నగదు, రూ. 3 లక్షల విలువైన బంగారం, 2 బైక్‌లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పక్కదారి పట్టిందని గుర్తించి, ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. -
కంట్లో కారం చల్లి రూ. 35 లక్షల చోరీ
మునుగోడు : ద్విచక్ర వాహనంపై నగదు తీసుకెళ్తున్న యువకుల కంట్లో కారం చల్లి రూ.35 లక్షల చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగింది. తిప్పర్తి మం డలం ఎల్లమ్మగూడెంకి చెందిన సుంకరబోయిన నాగరాజు, నల్లగొండ పట్టణానికి చెందిన చింత శ్రీనివాస్‌లు నల్లగొండలోని ప్యామిడీ క్యాష్ కంపెనీలో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే ఏటీఎం సెంటర్లలో డబ్బులు పెట్టేందుకు రూ. 42.5 లక్షలు తీసుకొని మధ్యా హ్నం నల్లగొండ నుంచి ద్విచక్రవాహనంపై బయలు దేరారు. మునుగోడుకు చేరుకొని అక్కడ ఇండిక్యాష్ ఏటీఎంలో రూ.7.50 లక్షలు డిపాజిట్ చేశారు. మిగిలిన రూ. 35 లక్షలను గట్టుప్పల్, కనగల్ల్లోని ఏటీఎంలలో డిపాజిట్ చేసేందుకు మునుగోడు మండలం కొంపల్లి మీదుగా బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లగానే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మరో ద్విచక్ర వాహనంపై వెనక నుంచి వచ్చి వారిపై కారం చల్లారు. శ్రీను కంట్లో కారం పడటంతో నాగరాజు బైక్‌ను ఆపాడు. వెంటనే వారి వద్ద ఉన్న రూ.35 లక్షల నగదు బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. నల్లగొండ డీఎస్పీ సుధాకర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నాగరాజు, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డబ్బులు రవాణా చేస్తున్న యువకులే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.