కంట్లో కారం చల్లి రూ. 35 లక్షల చోరీ
మునుగోడు : ద్విచక్ర వాహనంపై నగదు తీసుకెళ్తున్న యువకుల కంట్లో కారం చల్లి రూ.35 లక్షల చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగింది. తిప్పర్తి మం డలం ఎల్లమ్మగూడెంకి చెందిన సుంకరబోయిన నాగరాజు, నల్లగొండ పట్టణానికి చెందిన చింత శ్రీనివాస్‌లు నల్లగొండలోని ప్యామిడీ క్యాష్ కంపెనీలో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే ఏటీఎం సెంటర్లలో డబ్బులు పెట్టేందుకు రూ. 42.5 లక్షలు తీసుకొని మధ్యా హ్నం నల్లగొండ నుంచి ద్విచక్రవాహనంపై బయలు దేరారు. మునుగోడుకు చేరుకొని అక్కడ ఇండిక్యాష్ ఏటీఎంలో రూ.7.50 లక్షలు డిపాజిట్ చేశారు.
మిగిలిన రూ. 35 లక్షలను గట్టుప్పల్, కనగల్‌ల్లోని ఏటీఎంలలో డిపాజిట్ చేసేందుకు మునుగోడు మండలం కొంపల్లి మీదుగా బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లగానే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మరో ద్విచక్ర వాహనంపై వెనక నుంచి వచ్చి వారిపై కారం చల్లారు. శ్రీను కంట్లో కారం పడటంతో నాగరాజు బైక్‌ను ఆపాడు. వెంటనే వారి వద్ద ఉన్న రూ.35 లక్షల నగదు బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. నల్లగొండ డీఎస్పీ సుధాకర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నాగరాజు, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డబ్బులు రవాణా చేస్తున్న యువకులే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.