ఆంధ్రాకు తరలిన హెలెన్ తుపాను
టీ.నగర్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను ఆంధ్ర తీరం వైపు పయనిస్తోంది. గురువారం ఉదయం నాటికి ఇది బంగాళాఖాతంలో తూర్పు నుంచి ఈశాన్యం వైపుగా ప్రయాణించి ఆంధ్రరాష్ర కావలి నుంచి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడుకు పెద్దగా నష్టం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. అయితే ఆంధ్రాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.
ఈ జిల్లాలలో గురువారం రాత్రి నుంచి భీకర గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరించింది. చెన్నై వాతావరణ పరిశోధన శాఖ డెరైక్టర్ రమణన్ మాట్లాడుతూ హెలెన్ తుపాన్ శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం మచిలీపట్టణం సమీపాన తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రానున్న 24 గంటల్లో దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గత 24 గంటల్లో గరిష్టంగా ముళచ్చల్ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు, తక్కలైలో 9 సెంటీమీటర్లు, అంబాసముద్రంలో 6 సెంటీమీటర్లు, తెన్‌కాశిలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపారు.