నిరాశే కానీ... ఇదే గెలుపు పాఠమవుతుంది
సరిగ్గా... ఇరవైఏళ్ల క్రితం సంగతి. 1998లో లియాండర్ పేస్ న్యూపోర్ట్ ఓపెన్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో ఫైనల్ చేరడం గగనమే అయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు చెన్నై కుర్రాడు రామ్‌కుమార్ రామనాథన్ సింగిల్స్ బరిలో పోరాడి ఓడాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత భవిష్యత్ ఆశాకిరణమయ్యాడు.
న్యూఢిల్లీ: టైటిల్ పోయింది. రెండు దశాబ్దాల నిరీక్షణ అలాగే ఉంది. కానీ... సింగిల్స్‌లో చాన్నాళ్లకు ఓ భారత ఆటగాడు తెరమీదికొచ్చాడు. అతనే చెన్నైకి చెందిన రామ్‌కుమార్ రామనాథన్. భారత ఆశల్ని తన భుజాన మోసు కెళ్లేందుకు అడుగులు వేస్తున్నాడు. న్యూపోర్ట్ ఓపెన్ టోర్నీలో టైటిల్ చేజారినా... ఈ ప్రయ త్నాన్ని ఓ గెలుపు పాఠంగా మలచుకుంటానని తెలిపాడు. ఇంకా అతనేమన్నాడంటే...
నిరాశ నిజమే!
ఫైనల్లో ఓటమి నిరాశ కలిగించింది. కానీ ఇక్కడిదాకా రావడమే క్లిష్టమైన పయనం. నేను తృటిలో టైటిల్‌ను కోల్పోయానంతే. ఇప్పుడు ఈ మ్యాచ్ రికార్డింగ్‌ను చూస్తా. ఎక్కడ ఏ తప్పు చేశానో స్వయంగా తెలుసుకొని మళ్లీ అవి పునరావృతం కాకుండా చూసుకుంటా. ఇదో అనుభవపాఠంగా సద్వినియోగం చేసుకుంటాను. ఈ టోర్నీకంటే ముందు నేను ఆడిన నాలుగు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడాను. ఇప్పుడిలా ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది.
పేస్ మద్దతు...
న్యూపోర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో నా ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నా. ఇందుకోసం చాన్నాళ్ల నుంచే కష్టపడుతున్నాను. టోర్నమెంట్లలో ప్రతీ రౌండ్‌ను తాజాగా ప్రారంభించేందుకు, వంద శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇష్టపడతాను. రెండో రౌండ్లోనే డెనిస్ కుడ్లాతో క్లిష్టమైన పోటీ ఎదురైంది. అయినా నింపాదిగా ఆడా. తర్వాత స్టాండ్స్‌లో లియాండర్ పేస్ మ్యాచ్‌ను వీక్షిస్తూ ఇచ్చిన మద్దతు మరువలేను.
12 ఏళ్లకే యోగా...
నా కెరీర్‌కు యోగా, ధ్యానం కూడా సాయపడ్డాయి. అనవసర ఒత్తిడి దరిచేరకుండా అవి కాపాడాయి. నిజానికి నేను 12 ఏళ్ల వయసులోనే యోగా తరగతులకు వెళ్లాను. కొంతకాలమయ్యాక మానేశాను. మళ్లీ ఏడాది క్రితం నుంచి నిత్యం యోగా, ధ్యానం చేస్తున్నాను.
టాప్–10 ప్లేయర్‌ను ఓడించాక...
గత 15 నెలలుగా నేను నాలుగు ఏటీపీ చాలెంజర్ టూర్ ఈవెంట్లలో రన్నరప్‌గా నిలిచాను. దీంతో పాటు అంటాల్యా ఓపెన్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్‌ను కంగుతినిపించడం నాలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ టోర్నీలోనైనా, ఏ ప్రత్యర్థినైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్నిచ్చింది.
దేశానికి ఆడటమే గౌరవం...
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నే కావొచ్చు. కానీ అదేసమయంలో ఆసియా క్రీడలు ఉన్నాయి. దీంతో దేశానికి ఆడటమే గొప్పగా భావించాను. అందుకే యూఎస్ నుంచి తప్పుకొని జకార్తాకే మొగ్గుచూపాను. ఇపుడు దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
►సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రామ్‌కుమార్ ఏకంగా 46 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 115వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.