‘కామసూత్ర’ తరహాలో తీసుంటే పోయేది!
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో సంజయ్ లీలా బన్సాలీ తీస్తున్న ‘పద్మావతి’ సినిమా షూటింగ్ సందర్భంగా రాజ్‌పుత్ కర్ణి సేన దాడి చేయడం తెల్సిందే. అయితే సినిమా షూటింగ్‌ల సందర్భంగా రాజస్థాన్‌లో గొడవలు చేయడం అతిసాధారణం. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోనే సినిమాలు తీసేందుకు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ సినిమా సంస్థలు కూడా పోటీ పడుతుంటాయి. చారిత్రక, సాంస్కతి వారసత్వ సంపదతో సుందర ప్రదేశంగా రాజస్థాన్ రాష్ట్రం వాసికెక్కడమే అందుకు కారణం. కమర్షియల్ సినిమాలతోపాటు మ్యూజిక్ వీడియో అల్బంలను కూడా ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా తీస్తారు. ఇక చారిత్రక సినిమాలకైతే పెట్టింది పేరు.
రాజస్థానాల్లో షూటింగ్‌లు నిర్వహించాలంటే రెండు స్థాయిల్లో అనుమతులు తప్పనిసరి. ఒకటి అధికారుల స్థాయిలో, అది సులభంగానే లభిస్తుంది. రెండోది స్థానిక పెద్దల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు వారికి స్క్రిప్టు ఏమిటో వివరించాలి. అది వారి మనోభావాలకు విరుద్ధంగా ఉండకూడదు. అప్పుడే వారికి షూటింగ్ కోసం అనుమతిస్తారు. తాము ఊహించినట్లుగా సినిమాలేకపోతే సినిమా విడుదల అనంతరం కూడా స్థానికులు గొడవలు చేస్తారు. ఐశ్వర్యరాయ్, హతిక్ రోషన్ నటించిన ‘జోదా అక్బర్’ సినిమా షూటింగ్ సందర్భంగానే కాకుండా సినిమా విడుదల అనంతరం కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. సినిమా పోస్లర్లు చించివేయడం, సినిమా హాళ్లలో ప్రదర్శనలను నిలిపివేయడం చేశారు.
రాజస్థాన్ ప్రజల మనస్తత్వం గురించి తెల్సిన మీరా నాయర్, 1996లో ‘కామసూత్ర–ఏ టేల్ ఆఫ్ లవ్ స్టోరీ’ని సినిమా టైటిల్ చెప్పకుండా స్థానిక పెద్దలను భ్రమలో ఉంచి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ‘ప్రాజెక్ట్ 5’ పేరుతో ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకుండా అప్పుడు కామసూత్ర సినిమా షూటింగ్‌ను పూర్తి చేశామని ఆ సినిమా ప్రొడక్షన్ యూనిట్లో పనిచేసిన సురేందర్ కుమార్ కాల్రా తెలియజేశారు. సంజయ్ లీలా బన్సాలీ కూడా సినిమా టైటిల్ పేరు చెప్పకుండా పద్మావతి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. షూటింగ్ సందర్భంగా ఉండేంత నిరసన సినిమా విడదలయ్యాక ఉండదని ఆయన అన్నారు. కామసూత్ర సినిమా విడుదలయ్యాక దానికి వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రజలు ఆందోళన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
మాధురీ దీక్షిత్‌తో ‘మీనాక్షి ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా కూడా స్థానిక ప్రజలు గొడవ చేశారు. ఆ సినిమా దర్శకుడు ఎంఎఫ్ హుస్సేన్ ముస్లిం కావడమే అందుకు కారణం. రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా తీసిన ‘ఢిల్లీ 6’ సినిమా షూటింగ్ సందర్భంగా కూడా స్థానిక పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వారితో పలు దఫాలుగా చిత్రం యూనిట్ చర్చలు జరిపి నచ్చచెప్పారు. 2013లో చార్లెస్ శోభరాజ్‌పై తీసిన ‘మై ఔర్ చార్లెస్’ సినిమా షూటింగ్ సందర్భంగా కూడా గొడవ జరిగింది. అప్పుడు పోలీసులే సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. రాజకీయ పెద్దల జోక్యంతో గొడవ పెద్దదై చివరకు కొంత మంది పోలీసు అధికారుల బదిలీకి దారితీసింది. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్లో పుట్టిన నార్వే దర్శకురాలొకరు అంతర్జాతీయ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. అప్పుడు ఉదయపూర్, అజ్మీర్‌లో జరగాల్సిన ఆమె షూటింగ్ ను అడ్డుకున్నారు. పాకిస్థాన్ కళాకారులను దేశం నుంచి తరిమివేయాలనే పిలుపు నేపథ్యంలో దర్శకురాలు పాకిస్థాన్ అమ్మాయి అనుకొని స్థానికులు షూటింగ్‌కు అడ్డుపడ్డారు. ఆమె పాకిస్థాన్‌లో పుట్టారుగానీ నార్వే దేశస్థురాలంటూ ఆమె పాస్‌పోర్టును చూపిస్తేగానీ స్థానికులు షూటింగ్‌ను అనుమతించలేదు.
బన్సాలీ చిత్రం యూనిట్‌పై రాజ్‌పుత్ కర్ణి సేన దాడిచేసి ఐదు రోజులు గడిచినా ఇంతవరకు అక్కడి పోలీసులు కేసు బుక్ చేయలేదు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వయంగా ఫోన్‌చేసి అక్కడి బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పినా ఆమె స్పందించలేదు. అక్కడి ప్రభుత్వం ఎప్పుడూ హిందు సేనల జోలికి వెళ్లదు.