శాంతి, ఐకమత్యం నెలకొల్పాలి
ప్రభుత్వానికి ఎడిటర్ల వినతి
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతుండటంపై అఖిల భారత వార్తాపత్రికల ఎడిటర్ల కాన్ఫరెన్స్ (ఏఐఎన్ఈసీ) ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ వర్గాల మధ్య శాంతి, ఐకమత్యం నెలకొల్పేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు జర్నలిస్టులపై దాడులు పెరుగుతుండటంపై విశ్వబంధు గుప్తా అధ్యక్షతన ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏఐఎన్ఈసీ ఆందోళన వెలిబుచ్చింది. వృత్తి విధుల్లో నిమగ్నమయ్యే జర్నలిస్టులకు భద్రత కల్పించడం దేశ ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛకు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడింది. జర్నలిస్ట్ లపై దాడులకు పాల్పడే వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలంది.