attenders
-
ఆయనకు కాళ్లు, ఒళ్లు పట్టాలి..
బేస్తవారిపేట: రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు..రాచరికం అంతమైంది..కానీ అదే రాచరికపు పోకడలను గుట్టుగా కొనసాగిస్తున్నాడు ఓ ఉన్నతాధికారి. ఉన్నత ఉద్యోగం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తనకింది స్థాయి సిబ్బందితో ఊడిగం చేయించుకుంటున్నాడు. రాచరికపు పోకడలను అనుసరిస్తూ తనను తాను రాజులా భావించుకుంటున్నాడు. సిబ్బందితో చెయ్యకూడని పనులు చేయించుకుంటూ హీనాతి హీనంగా చూస్తుండటంతో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఆ అటెండర్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన ప్రవర్తనతో విసుగు చెందిన సిబ్బంది కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదీ..కథ బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. ఎస్డీసీ ఎన్.విజయ్‌కుమార్ వారిని హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వ నుంచి హౌస్ రెంట్, టీఏ, డీఏ పొందుతూ కార్యాలయంలోనే నివాసం ఉంటున్నాడు. కంభంలో నివాసం ఉండే అటెండర్ అనిల్ ఉదయం ఐదు గంటలకే వేడినీళ్లు, కాఫీ తీసుకురావాలి. అటెండర్లు కాళ్లు పట్టాలి అవసరమైతే ఆయన ఒంటికి మసాజ్ చేయాలి. అంతేకాదు ఆయన దుస్తులను సైతం ఉతికి శుభ్రం చేసి పెట్టాలి. ఇవి చేయకుంటే బూతు పురాణం మొదలు పెడతాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తుండటంతో ఏడాదిగా అటెండర్లు మనసు చంపుకుని చాకిరీ చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ చిరుద్యోగి రోజూ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పట్టుకు రావాల్సిందే. కార్యాలయంలోనే నివాసం ఉంటుండటంతో టీవీ ఒకరు, సన్ డైరెక్ట్ ఒకరు తెచ్చి పెట్టే వరకు ఒప్పుకోలేదు. వెహికిల్ అలవెన్స్‌లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దొర కోసం కోళ్లు పెంచాలి క్యాంపుకు వెళ్లివచ్చేటప్పుడు సదరు ఉన్నతాధికారి రైతుల నుంచి కోళ్లు పట్టుకొస్తాడు. మీరు ఏం పెట్టి పెంచుతారో తనకు తెలియదని, పది రోజుల్లో మంచి సైజు రావాలంటూ ఆయన అటెండర్లను ఆదేశిస్తాడు. కోడిని కార్యాలయంలోనే కట్టేసి పెంచాల్సిన దుస్థితి. బాగా పెరిగిన తర్వాత ఆయన ఇంటికి పంపాల్సిన బాధ్యత కూడా అటెండర్లదే. నెల్లూరు వెళ్లి బాత్రూమ్లు శుభ్రం చేయాల్సిందే అటెండర్‌గా పనిచేసే మురళికి డ్రైవింగ్ కూడా వచ్చు. ఆయన్ను తన కారుకు డ్రైవర్‌గా ఉపయోగించుకుంటున్నాడు. నెల్లూరు, విజయవాడ, కడప ప్రాంతాల్లో తన సొంత అపార్ట్మెంట్లకు మురళిని తీసుకెళ్తాడు. మూడు.. నాలుగు రోజులు అక్కడే ఉండాల్సి రావడంతో కరోనా సమయంలో ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల ఆలనపాలన చూసుకోలేక మురళి తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు అపార్ట్మెంట్లో ఎవరైనా ప్లాట్ ఖాళీ చేస్తే దానిలో టాయిలెట్స్, లెట్రిన్ క్లీన్ చేయాలి. గృహాల్లో బూజు దులపాలి. ఉన్నత ఉద్యోగం చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను సైతం సదరు అధికారి కాజేశాడు. ఫ్యాన్లు, బాత్రూమ్ షింక్‌లు నెల్లూరులోని తన సొంత ఇంటికి చేర్చుకున్నాడు. కలెక్టర్‌కు ఫిర్యాదు వ్యక్తిగత పనులు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్‌కుమార్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదును కలెక్టర్, సీఏం కార్యాలయానికి బాధితులు పంపారు. సొంత పనులు చేస్తూ రాత్రి పూట కూడా కాపాలాగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, కాళ్లు పట్టించుకోవడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవడం వంటి పనులు చేస్తున్నాడని వారి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అర్చకులపై అటెండర్ పెత్తనం!
ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో ఓ అటెండర్..అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. భక్తులు దయతలచి హారతి పళ్లెంలో వేసే కానుకుల్లో వాటా కావాలని పట్టుబడుతున్నాడు. వాటా ఇవ్వని పక్షంలో కక్ష గట్టి అర్చకులను వేధిస్తున్నాడు. హారతి పళ్లెంలో వేసే కానుకలను గుడిలో విధులు నిర్వహించే అర్చకుడు, పరిచారకులు ఇద్దరు సగం, సగం పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంపకాల్లో కొంత మొత్తం (రూ. 100 వరకు ) అక్కడ ఆ రోజు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కానుకలు బాగా వస్తున్నాయని మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ అటెండర్ కొందరు సిబ్బందితో కలిసి ఆలయ అధికారికి ఆశలు రేకెత్తించారు. అధికారుల తరఫున ఆ అటెండర్.. అర్చకుల దగ్గరకు వెళ్లి ఇక మీదట కానుకలు మూడు భాగాలు చేయాలని అందులో ఒక భాగం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు అర్చకులు అడ్డుచెప్పడంతో హారతి పళ్లెంలో వేసే కానుకలు అన్నీ హుండీలో వేయిస్తున్నారు. అంతే కాకుండా ప్రసాదాల తయారీకి అందించే నిధుల్లో భారీగా కోతలు విధించారు. దీంతో పూర్వం నుంచి చేస్తున్న ఆచార వ్యవహారాలు కొనసాగించలేక పోతున్నామని కొంతమంది అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర సరుకులతోనే ప్రసాదాలు తయారు చేసి స్వామికి నివేదిస్తూ, ఉభయదారులకు సర్దుతున్నారు. ఇంత జరుగుతున్నా మఠం ప్రతినిధులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఆందోళనకు సిద్ధమవుతున్న అర్చకులు ఎన్నడూ లేని విధంగా ఓ అటెండర్ పెత్తనం చలాయిస్తూ ఉండడంతో అర్చకులంతా మూకుమ్మడి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అర్చకులందరూ సంతకాలు చేసి రాతపూర్వకంగా అహోబిలం మఠం ప్రతినిధి సంపత్‌కు ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు తీసుకోకపోతే వైదిక కార్యక్రమాలు నిలిపి గుడి ఎదుట నిరసనకు దిగాలని సమాయత్తమవుతున్నారు. ఖర్చు ఎక్కువ అవుతోంది కల్యాణం నిర్వహించే సమయంలో భక్తులు రూ.800తో కేసరి టికెట్ తీసుకుంటున్నారు. దేవస్థానానికి రూ. 2300 ఖర్చు అవుతోంది. దీంతో నష్టం వస్తుందని రూ. 800 మేరకు సరిపోయే సరుకులు మాత్రమే ఇస్తున్నాం. – కామేశ్వరి, అహోబిలం ఈఓ -
వెట్టిచాకిరి!
► సీఆర్డీఏలో ఆపరేటర్లు, అటెండర్ల విధులు దుర్భరం ► రెండేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేసినా పెరగని వేతనం ► రోజువారీ కూలీలుగానే పరిగణిస్తున్న అధికారగణం ► జీవో 151 ఉన్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు ► బతుకులు మారేదెలా అంటూ కన్నీటి పర్యంతం రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వారు లేనిదే భూములకు సంబంధించిన పాత, కొత్త రెవెన్యూ రికార్డులు బయటకు రాని పరిస్థితి. చివరకు చిన్న పేపర్ జిరాక్స్ తీయాలన్నా వారే చేయాలి. రైతుల నుంచి అవసరమైన సమాచారం సేకరించే విషయంలోనూ... ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైనా తెలియజేయాలన్నా కీలక పాత్ర పోషించేది కూడా వారే. మొత్తంగా వారు లేనిదే ఆ 33 వేల ఎకరాలు సమీకరించడం కష్టమయ్యేది. అటువంటి ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంలో వివక్ష చూపుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో 26 యూనిట్లలో 52 మంది ఆపరేటర్లు, మరో 52 మంది అటెండర్లు పనిచేస్తున్నారు. వీరిని 2015 జనవరిలో నియమించారు. ఆపరేటర్లకు నెలకు రూ.9,500, అటెండర్లకు నెలకు రూ.6,700 ఇస్తున్నారు. జీఓ నంబర్ 151 ప్రకారం ఆపరేటర్లకు రూ.15వేలు, అటెండర్లకు రూ.12వేలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు పెంపు విషయమై వారు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్లంతా రోజు కూలీలేనట .... ప్రభుత్వ అవసరాల కోసం నియమించిన వారిని ఉన్నతాధికారులు కొందరు రోజు కూలీల కిందే పరిగణిస్తున్నట్లు ఆపరేటర్లు, అటెండర్లు కన్నీరుపెడుతున్నారు. రాజధాని అవసరాల కోసం నియమించే సమయంలో నిబంధనల ప్రకారం వర్తించాల్సినవన్నీ వర్తిస్తాయని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ పెద్దల అవసరాలు తీరాక... ‘ఉంటే ఉండండి, వెళ్లాలంటే వెళ్లిపోండి’ అంటూ హీనంగా చూస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో రేయింబవళ్లు పనిచేసిన ఆపరేటర్లు, అటెండర్లకు ఎటువంటి అధికారిక నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులను అడిగితే... ‘మీరు రోజు కూలీల కిందే లెక్క. పనిచేసిన రోజు కూలీ. పనిచేయని రోజు లేదు’ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. వేతనాలు, అధికారిక ఉత్తర్వుల కోసం ఎక్కడైనా, ఎప్పుడైన ధర్నా, ఆందోళనలు చేస్తే వెంటనే తొలగించి కొత్తవారిని నియమించుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. వేతనాలు పెంచి చెల్లించటం కుదరదని తేల్చిచెప్పినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దల కార్యక్రమాలు ఉన్న ప్రతి రోజూ వేకువ జామునే కార్యాలయానికి చేరుకుని రాజ ధాని నిర్మాణానికి అవసరమైన రికార్డులను సిద్ధం చేసి ఇచ్చేవారు. ఆపరేటర్లు, అటెండర్లకు కనీసం సెలవులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లోనూ కొందరు అధికారులు వేధింపులకు గురిచేసే వారని కన్నీరుపెట్టుకున్నారు. పని పూర్తయ్యాకే వెళ్లమనే వారని, లేకపోతే ఆఫీసు నుంచి వెలుపలకు అడుగుపెట్టనిచ్చేవారు కారని భోరుమంటున్నారు. అటువంటి ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వేతనాలు పెం చే విషయమై ప్రభుత్వ పెద్దలు వివక్ష ప్రదర్శిస్తుండటంపై కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలో పనిచేస్తున్న ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంతో పాటు... వారి నియామకాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే సీఆర్డీఏ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
డ్రైవర్లు, అటెండర్లు రారు.. ఉద్యోగానికి వచ్చేదెలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుండటంతో స్త్రఫఋ సచివాలయంలో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లు విధులకు సెలవుపెట్టాలని నిర్ణయించుకున్నారు. సచివాలయంతో పాటు పలు విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా మంగళవారం సాధారణ సెలవు పెడుతున్నారు. ఏపీకి చెందిన ఉద్యోగులైనప్పటికీ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నందున పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం ఇంటి చిరునామా తదితర సర్టిఫికెట్లు కావాలంటే సర్వేకు వివరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఏపీకి చెందిన ఉద్యోగులకు కూడా మంగళవారం సెలవు పెడుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సెలవు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న డ్రైవర్లు, అటెండర్లు అత్యధికులు తెలంగాణకు చెందిన వారే కావటంతో వారు సర్వేకు వివరాలు అందించేందుకు ఇంటి దగ్గరే ఉండాలని భావిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వారి వాదనతో ఏకీభవిస్తున్నారు. అయితే.. డ్రైవర్లు, అటెండర్లు రారు.. ఆఫీస్‌కు వచ్చేదెలా..? అని ఏపీ సచివాలయంలో ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. నాల్గో తరగతి ఉద్యోగ సంఘం ధర్నా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరగనున్న సమగ్ర సర్వేకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సెలవు ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం (నాల్గవ తరగతి ఉద్యోగులు) డిమాండ్ చేసింది. సచివాలయం ఎల్ బ్లాక్ ముందు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు.