వెట్టిచాకిరి!
► సీఆర్‌డీఏలో ఆపరేటర్లు, అటెండర్ల విధులు దుర్భరం
► రెండేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేసినా పెరగని వేతనం
► రోజువారీ కూలీలుగానే పరిగణిస్తున్న అధికారగణం
► జీవో 151 ఉన్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు
► బతుకులు మారేదెలా అంటూ కన్నీటి పర్యంతం
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వారు లేనిదే భూములకు సంబంధించిన పాత, కొత్త రెవెన్యూ రికార్డులు బయటకు రాని పరిస్థితి. చివరకు చిన్న పేపర్ జిరాక్స్ తీయాలన్నా వారే చేయాలి. రైతుల నుంచి అవసరమైన సమాచారం సేకరించే విషయంలోనూ... ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైనా తెలియజేయాలన్నా కీలక పాత్ర పోషించేది కూడా వారే. మొత్తంగా వారు లేనిదే ఆ 33 వేల ఎకరాలు సమీకరించడం కష్టమయ్యేది. అటువంటి ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంలో వివక్ష చూపుతున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో 26 యూనిట్లలో 52 మంది ఆపరేటర్లు, మరో 52 మంది అటెండర్లు పనిచేస్తున్నారు. వీరిని 2015 జనవరిలో నియమించారు. ఆపరేటర్లకు నెలకు రూ.9,500, అటెండర్లకు నెలకు రూ.6,700 ఇస్తున్నారు. జీఓ నంబర్ 151 ప్రకారం ఆపరేటర్లకు రూ.15వేలు, అటెండర్లకు రూ.12వేలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు పెంపు విషయమై వారు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు.
వాళ్లంతా రోజు కూలీలేనట ....
ప్రభుత్వ అవసరాల కోసం నియమించిన వారిని ఉన్నతాధికారులు కొందరు రోజు కూలీల కిందే పరిగణిస్తున్నట్లు ఆపరేటర్లు, అటెండర్లు కన్నీరుపెడుతున్నారు. రాజధాని అవసరాల కోసం నియమించే సమయంలో నిబంధనల ప్రకారం వర్తించాల్సినవన్నీ వర్తిస్తాయని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ పెద్దల అవసరాలు తీరాక... ‘ఉంటే ఉండండి, వెళ్లాలంటే వెళ్లిపోండి’ అంటూ హీనంగా చూస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో రేయింబవళ్లు పనిచేసిన ఆపరేటర్లు, అటెండర్లకు ఎటువంటి అధికారిక నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులను అడిగితే... ‘మీరు రోజు కూలీల కిందే లెక్క. పనిచేసిన రోజు కూలీ. పనిచేయని రోజు లేదు’ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది.
వేతనాలు, అధికారిక ఉత్తర్వుల కోసం ఎక్కడైనా, ఎప్పుడైన ధర్నా, ఆందోళనలు చేస్తే వెంటనే తొలగించి కొత్తవారిని నియమించుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. వేతనాలు పెంచి చెల్లించటం కుదరదని తేల్చిచెప్పినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దల కార్యక్రమాలు ఉన్న ప్రతి రోజూ వేకువ జామునే కార్యాలయానికి చేరుకుని రాజ ధాని నిర్మాణానికి అవసరమైన రికార్డులను సిద్ధం చేసి ఇచ్చేవారు. ఆపరేటర్లు, అటెండర్లకు కనీసం సెలవులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లోనూ కొందరు అధికారులు వేధింపులకు గురిచేసే వారని కన్నీరుపెట్టుకున్నారు.
పని పూర్తయ్యాకే వెళ్లమనే వారని, లేకపోతే ఆఫీసు నుంచి వెలుపలకు అడుగుపెట్టనిచ్చేవారు కారని భోరుమంటున్నారు. అటువంటి ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వేతనాలు పెం చే విషయమై ప్రభుత్వ పెద్దలు వివక్ష ప్రదర్శిస్తుండటంపై కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో పనిచేస్తున్న ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంతో పాటు... వారి నియామకాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే సీఆర్డీఏ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.