విదేశీ ముడుపులపై ట్రంప్‌పై కేసు
న్యూయార్క్: అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్థిక వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ మేరీలాండ్, కొలంబియా జిల్లాల అటార్నిజనరళ్లు సోమవారం నాడు కేసు దాఖలు చేశారు. ఈ విదేశీ సొమ్ము లావాదేవీలకు వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ లగ్జరీ హోటల్ ప్రధాన కేంద్రంగా మారిపోయిందని వారు ఆరోపించారు. హోటళ్ల నెటవర్క్, తన గోల్ఫ్ కోర్సులను ఉపయోగించుకొని విదేశాల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్నారని వారు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు తమకు అనుకూలంగా వ్యవహరించేందుకు వీలుగా విదేశాలు ముడుపులు ముట్టచెబుతున్నాయన్నది అటార్నీ జనరళ్ల ప్రధాన ఆరోపణ. తన వ్యాపారాలకు, తనకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారని, అయితే ఆయన ఇప్పుడు ట్రంప్ ట్రస్ట్ పేరుతో వ్యాపారాలను యధావిథిగా నిర్వహిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. ట్రంప్ హోటల్ ప్రభావం వల్ల మేరీలాండ్, కొలంబియా జిల్లాలోని కన్సెన్షన్ సెంటర్లు, ఇతర రెస్టారెంట్లేవి నడవడం లేదని కూడా వాపోయారు.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు అటార్నీ జనరళ్లు వేసిన ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోర్టును కోరుతామని అమెరికా స్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పయిసర్ తెలిపారు. ఇదివరకు దాఖలైన ఇలాంటి ఓ కేసును కొట్టివేయాల్సిందిగా అమెరికా న్యాయశాఖ ఇప్పటికే కోర్టును కోరింది.