ఆదాయం రికార్డుల్లో నమోదు కాలేదు
- నిధుల దుర్వినియోగానికి కమిషనరే బాధ్యుడు
- రూ.2.50 కోట్ల అవకతవకలు
- జిల్లా ఆడిట్ అధికారి సీహెచ్ వేణుగోపాల్‌రావు
- తాండూరు మున్సిపల్ రికార్డు తనిఖీ
- బిల్లు పుస్తకాలు అందజేయని బిల్కలెక్టర్లు
తాండూరు : మున్సిపాలిటీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పూర్తి స్థాయిలో రికార్డుల్లోకి ఎక్కడం లేదని జిల్లా ఆడిట్ అధికారి సీహెచ్ వేణుగోపాల్‌రావు స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఆడిట్ అధికారులు కే శేఖర్‌రెడ్డి, సీహెచ్ సత్యనారాయణలు తాండూరు మున్సిపాలిటీలో రికార్డులను తనిఖీ చే శారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం పూర్తిగా జమ కావడం లేదని ప్రాథమికంగా మా దృష్టికి వచ్చిందన్నారు.
ఆయా పన్నుల వసూలుకు సంబంధించిన రసీదు పుస్తకాలను బిల్ కలెక్టర్లు కార్యాలయంలో అందజేయడం లేదన్నారు. నిధుల దుర్వినియోగానికి మున్సిపల్ కమిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తాండూరు మున్సిపాలిటీలో బిల్కలెక్టర్లు మల్లికార్జున్, కుమార్‌లు మూడు రసీదు పుస్తకాలు నేటికీ అందజేయాలేదన్నారు. ఆయా రసీదు పుస్తకాలకు సంబంధించిన పన్ను వసూలు ద్వారా వచ్చిన ఆదాయం సర్‌చార్జితో రెండు నెలల్లో చెల్లించాలని కమిషనర్ లేఖ రాస్తామన్నారు.
ఐదు శాతం దుర్వినియోగం
జిల్లాలో మొదటి విడత 25 శాతం పంట రుణమాఫీలో 5 శాతం దుర్వినియోగం అయ్యిందని ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలతో జిల్లాలో పంట రుణాల మాఫీపై ఆడిట్ చేసినట్టు చెప్పారు. ఒక కుటుంబానికి రూ.1 లక్ష రుణమాఫీకి బదులు భార్యాభర్తలు, తండ్రీకొడుకులకు రుణమాఫీ అయినట్టు ఆడిట్లో తేలిందన్నారు. బోగస్ పట్టాపాసుపుస్తకాలతో కూడా రుణమాఫీ పొందినట్టు గుర్తించడం జరిగిందన్నారు. మొదటి విడతలో 5 శాతం అనర్హులు రుణమాఫీ పొందినట్టు, రూ.2.50 కోట్ల దుర్వినియోగం అయ్యిందన్నారు. ఈ విషయంలో రెవెన్యూ, బ్యాంకర్ల పొరపాట్లు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.