‘100 రోజుల్లో ఆస్ట్రేలియాను గట్టెక్కిస్తా’
విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న దక్షిణ ఆస్ట్రేలియాను టెస్లా ఇంక్ బాస్ ఎలోన్ మస్క్ ఆ సంక్షోభం నుంచి బయటపడేయనున్నారట. 100 రోజుల్లో ఆస్ట్రేలియాను విద్యుత్ సంక్షోభం నుంచి గట్టేకిస్తానని, లేనిపక్షంలో ఉచితంగా తమ సేవలందించనున్నట్టు మస్క్ తెలిపారు. బిలియనీర్ ఎంటర్ ప్రిన్యూర్ మైక్ కానన్-బ్రూక్స్ ఛాలెంజ్ పై స్పందించిన మస్క్ ఈ ఆఫర్ ను ప్రకటించారు. మస్క్.. ఎంత వరకు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నావు? 100 రోజుల్లో 100 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు గ్యారెంటీ ఇవ్వగలవా? అనే సవాల్ ను టెస్లా వ్యవస్థాపకుడికి మైక్ కానన్ విసిరారు. 17 లక్షల ప్రజలున్న దక్షిణ ఆస్ట్రేలియా విద్యుత్ కోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత సెప్టెంబర్ లో వచ్చిన తుఫాను అనంతరం విద్యుత్ తీగలన్నీ దెబ్బతిని దక్షిణ ఆస్ట్రేలియా అంధకారంలోకి వెళ్లిపోయింది.
దీంతో ఆ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆ ప్రాంతాన్ని వీడి వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. తుఫాను అనంతరం ఆ రాష్ట్రంలో వడగాలులు మరో బీభత్సం సృష్టించాయి. అప్పటినుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రాధాన్యత ప్రకారం సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. గ్రిడ్ స్టోరేజ్ పెంపును కూడా చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ కారు, బ్యాటరీ మేకర్ టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ ఈ ఆఫర్ ను దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చారు. 25 మిలియన్ డాలర్ల విలువైన 100 మెగావాట్ అవర్స్ బ్యాటరీ స్టోరేజ్ ను అందించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాజకీయ మద్దతు ఇప్పించడానికి, ఫండింగ్ కల్పించడానికి కెనూన్-బ్రూక్స్ కూడా సహాయం చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ విషయంపై ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వెంటనే స్పందించలేదు. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన సారా హన్సన్-యంగ్ సెనేటర్ మాత్రం ఈ ఆఫర్ పై మస్క్ తో చర్చించనున్నట్టు తెలిపారు.