australia open super series
-
నిరీక్షణ ముగిసేనా!
ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్‌కు అంతగా కలిసి రాలేదు. సైనా నెహ్వాల్ టైటిల్ నెగ్గడం మినహా ఇప్పటివరకు పురుషుల సింగిల్స్‌లో ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు టైటిల్ సాధించలేకపోయారు. విపరీతమైన పోటీ, కీలక సమయాల్లో తడబాటు, ఇంకా కుదురుకోని కొత్త కోచ్‌లు... ఇతరత్రా కారణాలతో భారత ఆటగాళ్లు ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. అయితే ఈనెల నాలుగు నుంచి జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనైనా పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు విజయం సాధించి టైటిల్ నిరీక్షణకు ముగింపు పలుకుతారో లేదో వేచి చూడాలి. సాక్షి, హైదరాబాద్: సుదర్మిన్ కప్‌లో నిరాశాజనక ఫలితాల తర్వాత భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు మరోఅంతర్జాతీయ టోర్నమెంట్‌కు సంసిద్ధమయ్యారు. ఈనెల నాలుగున సిడ్నీలో మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ సూపర్–300 టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత బృందం శుక్రవారం బయలుదేరింది. అందుబాటులో ఉన్న ‘డ్రా’ ప్రకారం పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ బరిలో ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ పోటీపడుతున్నాడు. భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సీజన్లో ఏడో టోర్నమెంట్లో ఆడనున్న సాయిప్రణీత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన సాయిప్రణీత్ ఆ తర్వాత ఆశించినరీతిలో ఆడలేకపోయాడు. కశ్యప్, ప్రణయ్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో లిన్ డాన్‌తో ప్రణయ్; సుపన్యు అవింగ్సనోన్తో కశ్యప్ ఆడతారు. ఒకవేళ వీరిద్దరు గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. సాయిప్రణీత్ తొలి రౌండ్లో లీ డాంగ్ కెయున్ (కొరియా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అతనికి ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) ఎదురయ్యే చాన్స్ ఉంది. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి రౌండ్లో సింధు క్వాలిఫయర్‌తో ఆడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మను అత్రి–సుమీత్ రెడ్డి జోడీలు తొలి రౌండ్లోనే ముఖాముఖిగా తలపడనున్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి జంట బరిలోకి దిగనుంది. -
సిడ్నీ వాకిట్లో...‘శ్రీ’ వెలుగులు
♦ విశ్వవిజేత, రియో ఒలింపిక్స్ చాంపియన్‌పై శ్రీకాంత్ అద్భుత విజయం ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం ♦ వారం వ్యవధిలో రెండో సూపర్ సిరీస్ టైటిల్ ♦ రూ. 36 లక్షల 28 వేల ప్రైజ్‌మనీ సొంతం మరో సంచలనం... మరో టైటిల్... ప్రత్యర్థి ఎవరైతే నాకేంటి అంటూ... భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ అంతర్జాతీయ వేదికపై మళ్లీ అద్భుతం చేశాడు.వారం వ్యవధిలో రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలిచాడు. శ్రీకాంత్ ధాటికి ఈసారి ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ చేతులెత్తేశాడు. సిడ్నీ: ఇటీవల కాలంలో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులపై తాను సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ నిరూపించాడు. ఆదివారం ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ విజేతగా అవతరించాడు. 46 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22–20, 21–16తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 28 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వారం వ్యవధిలో శ్రీకాంత్‌కిది రెండో సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. ఈనెల 18న శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను నెగ్గిన సంగతి విదితమే. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్లో ఇది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో అతను చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. సాధికారిక ఆటతీరు... చెన్ లాంగ్‌తో గతంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన శ్రీకాంత్ ఈసారి మాత్రం పూర్తిగా పైచేయి సాధించాడు. ఒత్తిడికి లోనుకాకుండా, సహజశైలిలో, సంయమనంతో, పక్కా ప్రణాళికతో ఆడితే చైనా స్టార్ ఆటగాళ్లను ఓడించడం సాధ్యమేనని శ్రీకాంత్ నిరూపించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా), క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ (భారత్), సెమీస్‌లో నాలుగో ర్యాంకర్ షి యుకి (చైనా)లను ఓడించిన శ్రీకాంత్ ఫైనల్లో కూడా జోరు కొనసాగించాడు. ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ విరామానికి 11–9తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ, నెట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, అడపాదడపా స్మాష్ షాట్లు సంధిస్తూ శ్రీకాంత్ తన ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. స్కోరు 20–20 వద్ద శ్రీకాంత్ రెండు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్‌లోనూ శ్రీకాంత్ సాధికారికంగా ఆడాడు. స్కోరు 9–9 వద్ద మూడు పాయింట్లు గెలిచిన అతను 12–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. స్కోరు 20–16 వద్ద చెన్ లాంగ్ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో శ్రీకాంత్ విజయం ఖాయమైంది. చెన్ లాంగ్ వరుసగా రెండు టోర్నీల్లో భారత ప్లేయర్ల చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. ఇండోనేసియా ఓపెన్‌లో ప్రణయ్ చేతిలో ఓడిన చెన్ లాంగ్ ఈసారి శ్రీకాంత్‌కు తలవంచాడు. రూ. 5 లక్షలు, టీయూవీ 300 కారు... భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమాంత బిశ్వ శర్మ శ్రీకాంత్‌ను అభినందించారు. ‘బాయ్’ తరఫున రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. అయితే ఒక అభిమాని ఇది చాలా తక్కువ మొత్తమని, ఏదైనా చేయమంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు ట్వీట్ చేశారు. దాంతో స్పందించిన ఆయన ‘అవునా, శ్రీకాంత్ పోరాటతత్వం మనం గర్వపడేలా చేసింది. నా తరఫున మహీంద్ర టీయూవీ 300 కానుకగా ఇస్తున్నాను’ అంటూ ‘బాయ్’ నజరానా కంటే విలువైన బహుమతిని ప్రకటించారు. అభినందనల వెల్లువ... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌పై అన్ని వైపుల నుంచి అభినందనల వర్షం కురిసింది. ప్రధానమంత్రి మొదలు పలువురు ప్రముఖులు అతడిని అభినందించారు. ‘శ్రీకాంత్ విజయం పట్ల మేమంతా గర్వంగా ఉన్నాం. మరో అద్భుత విజయం సాధించిన అతడికి అభినందనలు’ అని మోడి ట్వీట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడుతో పాటు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్‌ను అభినందించిన వారిలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సానియా మీర్జా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, తెలంగాణ క్రీడా మంత్రి టి.పద్మారావు కూడా ఉన్నారు. -
శ్రీకాంత్ కు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ బ్యాడ్యింటన్ టైటిల్ ను సాధించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ పై గెలవడం ద్వారా మరొక మైలురాయిని చేరుకున్న శ్రీకాంత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో శ్రీకాంత్ 22-20, 21-16 తేడాతో చెన్ లాంగ్ ను మట్టికరిపించాడు. 45 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్ లో రెండు గేమ్ ల్లోనూ తీవ్రమైన పోటీని ఎదుర్కొన శ్రీకాంత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. . ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లోనూ శ్రీకాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ ను శ్రీకాంత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది శ్రీకాంత్ కు తొలి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కాగా, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనతను భారత్ నుంచి సాధించింది శ్రీకాంతే కావడం మరో విశేషం. ఈ టైటిల్ ను గెలిచిన శ్రీకాంత్ కు రూ. 5లక్షల ప్రైజ్‌మనీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) ప్రకటించింది. -
శ్రీకాంత్ సంచలనం
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో రియో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా)పై విజయం సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. హోరాహోరీగా సాగిన అమీతుమీ పోరులో శ్రీకాంత్ 22-20, 21-16 తేడాతో చెన్ లాంగ్ ను మట్టికరిపించాడు. 45 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్ లో రెండు గేమ్ ల్లోనూ తీవ్రమైన పోటీని ఎదుర్కొన శ్రీకాంత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.తొలి గేమ్ ను 25 నిమిషాలు పాటు జరగగా, రెండో గేమ్ 20 నిమిషాల్లో ముగిసింది. అంతకుముందు వీరిద్దరూ ఐదుసార్లు తలపడిన ముఖాముఖి పోరులో చెన్ లాంగ్ నే పైచేయి సాధించాడు. కాగా, కొంతకాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్.. లాంగ్ పై ఉన్న ఆ రికార్డుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లోనూ శ్రీకాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ ను శ్రీకాంత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది శ్రీకాంత్ కు తొలి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కాగా, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనతను భారత్ నుంచి సాధించింది శ్రీకాంతే కావడం మరో విశేషం. -
ఫైనల్లో శ్రీకాంత్
సిడ్నీ:ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించి మంచి ఊపు మీద ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్.. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైతం ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 21-10, 21-14 తేడాతో షి యుకి(చైనా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఏకపక్షంగా సాగిన రెండు గేమ్‌ల్లో శ్రీకాంత్ ఆద్యంత నిలకడను ప్రదర్శించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్ లో కాస్త కష్ట పడ్డాడు. ఓవరాల్ గా 40 నిమిషాల్లోపే మ్యాచ్ ను ముగించిన శ్రీకాంత్ సగర్వంగా ఫైనల్ కు చేరాడు. తద్వారా వరుసగా మూడో టోర్నీలో ఫైనల్ కు చేరాడు. అంతకముందు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్, ఇండోనేసియా ఓపెన్‌లో శ్రీకాంత్ ఫైనల్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
మళ్లీ నంబర్‌వన్‌ను ఇంటికి పంపించాడు..
సిడ్నీ:ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించి మంచి ఊపుమీద ఉన్న తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్.. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ లో సైతం తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 15-21, 21-13, 21-13 తేడాతో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు సన్ వాన్ హో(దక్షిణాకొరియా)పై మరోసారి సంచలన విజయం సాధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. తొలి గేమ్ ను కోల్పోయి వెనకబడ్డ శ్రీకాంత్.. ఆపై పుంజుకుని వరుస రెండు గేమ్‌లను కైవసం చేసుకున్నాడు. ఇండోనేసియా ఓపెన్ లో సైతం సన్ వాన్ హోను శ్రీకాంత్ ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ సెమీ ఫైనల్లో సన్ వాన్ హోతో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీకాంత్ పైచేయి సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో మరొక భారత క్రీడాకారుడు సాయి ప్రణీత్ ముందంజ వేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-15, 18-21, 21-13 తేడాతో హువాంగ్ యుజియాంగ్ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్ కు చేరాడు.