Australian Open badminton tournament
-
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్, సమీర్ వర్మ
సిడ్నీ: అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు భమిడిపాటి సాయి ప్రణీత్, సమీర్ వర్మ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21–12, 21–14తో మౌలానా పంజి అహ్మద్ (ఇండోనేసియా)పై; నాలుగో సీడ్ సమీర్ వర్మ 21–16, 21–12తో టకుమా ఉయెదా (జపాన్)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 21–17, 21–17తో హుక్ జిన్ చొయి–యుంగ్ హూన్ పర్క్ జోడీపై; అర్జున్–రామచంద్రన్ ద్వయం 21–15, 25–23తో ఒకముర–ఒనోదెరా (జపాన్) జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 5–21, 5–21తో హన్ యూ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మేఘన–పూర్విషా జంట 11–21, 13–21తో మికి కశిహర–మియుకీ కటో (జపాన్) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో శివమ్ శర్మ–పూర్విషా రామ్ ద్వయం 6–21, 13–21తో సెంగ్ జాయి సియొ–చై యూజుంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. తొలి రౌండ్లో ప్రణీత్ 21–17, 21–14తో మిష జిల్బెర్మన్ (ఇజ్రాయిల్)పై; సమీర్ 13–21, 21–17, 21–12తో అభినవ్ (న్యూజిలాండ్)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌరభ్ వర్మ 21–19, 17–21, 12–21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో... జయరామ్ 20–22, 22–20, 21–17తో టకెశిటా (జపాన్) చేతిలో... లక్ష్యసేన్ 20–22, 21–13, 19–21తో లీ చెక్ యూ (హాంకాంగ్) చేతిలో... రాహుల్ యాదవ్ 11–21, 17–21తో మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 19–21, 21–15, 21–15తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. సాయి ఉత్తేజిత 8–21, 19–21తో మినె (జపాన్) చేతిలో... శ్రీకృష్ణప్రియ 18–21, 20–22తో యూలియా (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సిడ్నీ: రియో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హైదరాబాద్ ప్లేయర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-7, 21-14తో ఫారిమన్ (ఆస్ట్రేలియా)పై... రెండో మ్యాచ్‌లో 21-16, 21-12తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై గెలిచాడు. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, తన్వీ లాడ్... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ బరిలో ఉన్నారు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో లాయ్ (ఆస్ట్రేలియా)తో సైనా; మిన్ (దక్షిణ కొరియా)తో సింధు; టిఫానీ (ఆస్ట్రేలియా)తో తన్వీ లాడ్... అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; హు యున్ (హాంకాంగ్)తో గురుసాయిదత్; ముస్తఫా (ఇండోనేసియా)తో సమీర్ వర్మ తలపడతారు.