కన్నడ రచయిత్రికి బెదిరింపు
బెంగళూరు/పట్నా: మత విద్వేష సంఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు ఓ కన్నడ రచయిత్రికి బెదిరింపులు వచ్చాయి. గొడ్డు మాంసం తినడాన్ని సమర్థిస్తూ, హిందూ ఆచారాలను ప్రశ్నించడంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయని బెంగళూరులో పోలీసు డిప్యూటీ కమిషనర్ బీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. మధుసూదన్ గౌడ అనే వ్యక్తి తనను బెదిరించారంటూ చేతనా తీర్థహళ్లి అనే రచయిత్రి హనుమంతనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. గొడ్డుమాంసం తినడాన్ని సమర్థిస్తూ చేతన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. చేతన హిందూమత ఆచారాలను ప్రశ్నిస్తూ పలు వ్యాసాలను రాశారు. బీఫ్ వినియోగానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.
మత విద్వేషాలపై గుల్జార్ ఆందోళన
మత విద్వేషాలు పెరిగిపోవడంపై ప్రముఖ కవి, పాటల రచయిత గుల్జార్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవలి హింసాత్మక సంఘటలను ఖండించారు. మునుపెన్నడూ ఇటువంటి సంఘటనలను చూడలేదని పేర్కొన్నారు. మతవిద్వేష సంఘటనలను నిరసిస్తూ పలువురు రచయితలు తమ సాహిత్య ఆకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. రచయితలు తమ నిరసనను తెలియజేయడానికే అవార్డులను వెనక్కు ఇస్తున్నారన్నారు. హత్యలు, హింసాత్మక సంఘటనలకు సాహిత్య అకాడమీకి సంబంధం లేకపోయినప్పటికీ, ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయడానికే వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని గుల్జార్ అభిప్రాయపడ్డారు.