auto driver dead
-
అమ్మా.. నాన్నేడీ..?
అనంతపురం, గుత్తి: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం చెందాడు. అమ్మా.. నాన్న ఏడీ అని అమాయకంగా అడుగుతున్న కుమారుడిని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. ‘చనిపోయిన మీ నాన్నను నేను ఎక్కడికి వెళ్లి తేవాలిరా’ అంటూ గుండెలకు హత్తుకుని విలపించింది. వివరాల్లోకెళ్తే.. లచ్చానపల్లికి చెందిన దానే గాదిలింగ (27) ఆటో డ్రైవర్. మంగళవారం గుత్తి ఆర్ఎస్ నుంచి ప్రయాణికులతో గుత్తికి బయల్దేరాడు. మార్గం మధ్యలో మేదర కాలనీ (కర్నూలు రోడ్డు) స్పీడ్ బ్రేకర్ వద్ద ఎదురుగా వెళ్తున్న బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి ఆటో బోల్తాపడింది. గాదిలింగ ఎగిరి తన ఆటో కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ప్రమాద వార్త విని భార్య మల్లేశ్వరి, కుమారుడు ధీరజ్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. అమ్మా.. నాన్న ఎక్కడ అంటూ ఆ మూడేళ్ల బాలుడు తల్లిని అడుగుతున్న దృశ్యం చూసి అక్కడున్న వారు కన్నీరు పెట్టారు. ‘మీ నాన్న మనలను వదిలి దేవుని దగ్గరకు వెళ్లాడు నాయనా. మీ నాన్న ఇక రాడు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మల్లేశ్వరి రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ యువరాజు పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
శ్రీనివాసపురం(నాయుడుపేటౌన్): ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని శ్రీనివాసపురం సమీపంలో హైవేపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు.. మండలంలోని పూడేరు గ్రామానికి చెందిన పిలిమేటి సురేష్(28) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బాడుగకు వెళ్లి తిరిగి రాత్రి నాయుడుపేటకు వస్తున్నాడు. మార్గ మధ్యలో శ్రీనివాసపురం వద్ద హైవేపై చెన్నై నుంచి వస్తున్న కనిగిరి డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేసరికి అతను మృతి చెందాడు. మృతుడి వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా వివరాలు తెలుసుకున్న సిబ్బంది అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
తప్పతాగి.. 12 ఆటోలను గుద్దేశాడు!
ఆ కుర్రాడికి బాగా డబ్బుంది, చేతిలో ఖరీదైన కారుంది.. అంతే, తెగ తాగేసి తన పోర్షే కారుతో ఏకంగా 12 ఆటోలను గుద్దేశాడు. దాంతో ముగ్గురు డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా, మరో ఆటోడ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ న్యాయవిద్యార్థి (22)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై కెథెడ్రల్ రోడ్డులో జరిగింది. చాలావరకు ఆటోలు ఎందుకూ పనికిరాకుండా తుక్కుతుక్కుగా మారిపోయాయి. కారు కూడా బాగా దెబ్బతింది. ఒక్కసారిగా ఏదో కారు బ్రేకులు గట్టిగా వేసిన శబ్దం వినిపించిందని, ఈలోపు తన గుండె భాగంలో దెబ్బ తగిలి ఒక్కసారిగా కళ్లముందు చీకట్లు అలముకున్నాయని, లేచి చూసేసరికి పోలీసులు వచ్చి కారు నడుపుతున్న కుర్రాడిని లేపి తీసుకెళ్తున్నారని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆటోడ్రైవర్ సుందర్ చెప్పారు. ఆ తర్వాత 20 నిమిషాలకు తమను తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సు వచ్చిందన్నారు.