సోషల్ సైట్ల ద్వారా ఆటో ప్రచారం
గ్రేటర్ నోయిడా: యువ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కార్ల కంపెనీలు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల తలుపు తడుతున్నాయి. షెవర్లే(జనరల్ మోటార్స్), మెర్సిడెస్, హీరో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి కంపెనీలు యూ ట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లతో యువ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి.
మెర్సిడెస్ బెంజ్ సంస్థ 12వ ఆటో ఎక్స్‌పోలో తమ స్టాల్ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టింది. యువ వినియోగదారులకు తాజా సమాచారం కావాలని, అందుకే తాము డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారికి నేరుగా కనెక్ట్ అయ్యేలా వినూత్నమైన మార్కెటింగ్ విధానాలను అనుసరిస్తున్నామని హ్యుందాయ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక జనరల్ మోటార్స్ కంపెనీ షెవర్లె బ్రాండ్ కోసం చాటెరెట్టి పేరుతో వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. సందర్శకుల అభిప్రాయాలను, ప్రతిస్పందలను యూట్యూబ్‌లో షేర్ చేస్తోంది.
హీరో మోటొకార్ప్ కంపెనీ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో గూగుల్ ప్లస్ హ్యాంగవుట్ సెషన్‌ను నిర్వహించింది. భారత్‌లో 20 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని అంచనా. వాహనాలకు సంబంధించిన సమాచారానికి వినియోగదారులు టీవీ, వార్తాపత్రికల కంటే ఇంటర్నెట్పైననే అధికంగా అధారపడుతున్నారని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ హెడ్ గౌరవ్ కపూర్ చెప్పారు. వాహన కంపెనీలు ఇంటర్నెట్ను ఈ ఆటో షోకు కూడా బాగానే వినియోగించుకుంటున్నాయని ఆయన చెప్పారు.