పుష్టిగా ఉంటేనే బెస్టు!
బల్లిని చూస్తే బేర్మంటారు... కారు వేగం పెరిగితే క్యార్మంటారు... చాక్లెట్స్ అంటే ఇష్టంగా చప్పరించేస్తారు... ఇలా సోనాక్షీ సిన్హాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటి గురించి మీకు తెలుసా?!
* హీరోయిన్ కాకముందే సోనాక్షీ సిన్హా ఆటోగ్రాఫ్స్ ఇచ్చేవారట. ఆమె తండ్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాది పాట్నా. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు తండ్రితోపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనాక్షి పాట్నా వెళ్లినప్పుడు అక్కడివాళ్లు ఆటోగ్రాఫ్స్ అడిగితే, సిగ్గుపడుతూ ఇచ్చారట.
* ఫ్యాషన్ డిజైనర్ కావాలనే ఆకాంక్షతో ముంబయ్‌లోని ‘శ్రీమతి నాతీబాయ్ దామోదర్ తాకర్సే ఉమన్స్’ యూనివర్శిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు.
* ‘దబాంగ్’ చిత్రం ద్వారా కథానాయిక కాకముందు ‘మేరా దిల్ లేకే దేఖో’ అనే చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘దబాంగ్’ చిత్రానికి సల్మాన్ ఖాన్ కథానాయికగా అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
* దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ముంబయ్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా లేక వేరే ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా తనతో పాటు అదనంగా ఓ డ్రెస్ తీసుకెళతారు సోనాక్షి. ఒంటి మీద ఉన్న డ్రెస్ పొరపాటున చిరిగినా, అసౌకర్యంగా అనిపించినా నలుగురిలో నవ్వులపాలు కాకూడదు కాబట్టి, ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటారు.
* యాక్టర్స్ అందరూ కాంప్లికేటెడ్ అనుకుంటారు. కానీ తాను ఆ జాబితాకు చెందనని పలు సందర్భాల్లో సోనాక్షి పేర్కొన్నారు. అందుకే హీరోలను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటున్నారు. అన్‌కాంప్లికేటెడ్ పర్సన్స్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అది కూడా సినిమా రంగానికి చెందినవాళ్లని చేసుకోరట.
* సైజ్ జీరో అంటే చాలా చిరాకు. పుష్టిగా ఉంటేనే అందంగా ఉంటామంటున్నారు. అందుకే తననెవరైనా బొద్దుగా ఉంటావని విమర్శించినా వాటిని ప్రశంసలుగా భావిస్తారు.
* ఖరీదు గల కార్లు చూపించి అమ్మాయిలను పడగొట్టాలనుకునే అబ్బాయిలంటే పడదు. కాలేజ్ డేస్‌లో అలా బిల్డప్ ఇచ్చిన అబ్బాయిల బుర్ర తిరిగిపోయేలా క్లాస్ తీసుకునేవారు.
* బల్లులంటే తెగ భయం. సాలీడులంటే అలర్జీ. బల్లులంటే సోనాక్షీకి భయం అని తెలిసి, ‘జోకర్’ సినిమాలో నటించేటప్పుడు అక్షయ్ కుమార్ సరదాగా రబ్బర్ బల్లిని చూపిస్తూ, ఆమెను ఏడిపించేవారు. మొదటిసారి ఆ రబ్బర్ బల్లిని చూసి, నిజమైనదని నమ్మి, షూటింగ్ లొకేషన్లో పరుగులు పెట్టారు.
* చదువుకునే రోజుల్లో ఆటల్లో ఫస్ట్. వాలీబాల్, ఫుట్‌బాట్, త్రో బాల్, టెన్నిస్ బాగా ఆడేవారు. వేగంగా కారు నడపడం అంటే టెన్షన్. అలా నడిపేవాళ్లతో ప్రయాణం చేయరు.
* చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అవి తినకుండా ఉండలేరు. తిన్న తర్వాత గిల్టీగా అనిపిస్తుందని అంటుంటారు. అలాగే, డైట్ కోలా తెగ తాగుతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా తాగుతారట.
* పెయింటింగ్ అంటే సోనాక్షీకి ఇష్టం. తీరిక చిక్కినప్పుడల్లా బొమ్మలు గీస్తుంటారు. అలాగే ఖాళీ సమయాల్లో ఐప్యాడ్‌లో గేమ్స్ ఆడుతుంటారు.