AV patel
-
వైఎస్ జగన్‌తోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ అధ్యక్షుడు ఏవీ పటేల్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక హోదా కోసం ఆయన చేస్తున్న పోరాటం అమోఘమన్నారు. ఉద్యోగులు అన్ని విధాలుగా వైఎస్ జగన్‌కు అండగా ఉంటారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులను బానిసలుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గెజిటెడ్ అధికారులకు అపాయిట్మెంట్ ఇవ్వకుండా నారా చంద్రబాబునాయుడు అవమానించారని అన్నారు. అమ్ముడుపోయిన అశోక్ బాబు, బొప్పారాజుతో ఉద్యోగులను మోసం చేశారన్నారు. అమ్ముడుపోయిన నేతలను నమ్ముకున్న చంద్రబాబుకు ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. -
సమైక్య పోరుపై త్వరలో కార్యాచరణ
-
సమైక్య పోరుపై త్వరలో కార్యాచరణ
సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రెండు మూడు రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేస్తామని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.పటేల్ ప్రకటించారు. సోమవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చర్చకు రాక ముందే అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో తాకట్టుపెట్టారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు విషయంలో కేంద్రం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహ రిస్తోందని ఆరోపించారు. దేశంలో నెలకొన్న పలు సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయడం వెనక ఓట్లు, సీట్లు, కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దీన స్థితిలో ఉన్న ప్రతిసారీ ఉద్యోగులే సహకారమందించారని గుర్తు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఆ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా సమైక్య ఉద్యమంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ మరియన్న తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వరా?: ఏవీ పటేల్
విశాఖపట్నం: హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదనడంపై సమైక్యాంధ్ర గెజిటెడ్ ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా తాము 15రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగాంగానే త్వరలో ఉద్యమ కార్యాచారణ సిద్ధం చేస్తున్నామని ఏవీ పటేల్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు తెలియకుండానే .. రాష్ట్ర విభజనకు సిద్దమవ్వడం దారుణమని ఏవీ పటేల్ పేర్కొన్నారు.