పాఠశాలల్లో సెల్ వినియోగం నిషేధం
మోగితే ఉపాధ్యాయులపై చర్యలు
ఆర్జేడీ ప్రసన్నకుమార్ హెచ్చరిక
టెన్త్ ఉత్తీర్ణతపై ప్రత్యేక శ్రద్ధ
యలమంచిలి : పాఠశాలల పనివేళల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పాఠశాలల విద్య ఆర్జేడీ( కాకినాడ)ఎంఆర్ ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొన్ని పద్ధతులు తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ పట్టుబడితే సస్పెన్షన్ తప్పదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల వేళల్లో మొబైల్ ఫోన్ వినియోగించినందుకు ఒక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి వచ్చిన ఆయన పాఠశాలల నిర్వహణపై డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన పరిధిలో ఆరు జిల్లాల్లో 5,300 హైస్కూళ్ల నుంచి సుమారు 3.20లక్షల మంది టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు.
పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణతకు రోజువారి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నట్టు చెప్పారు. వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,సంప్రదాయ దుస్తులతో ఉపాధ్యాయులు పాఠశాలలకు రావాలని ఆదేశాలు పంపినట్టు తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ప్రణాళిక ప్రకారం బోధన చేపట్టాలన్నారు. పాఠశాలల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నోట్‌పుస్తకాలు, వర్క్‌బుక్‌లు తనిఖీ చేపడుతున్నట్టు చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులు చేసిన హోమ్‌వర్క్‌ను, నోట్‌పుస్తకాలను దిద్దకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయమై కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అదనపు తరగతులు నిర్వహించకూడదు కదా..? అని అడిగినపుడు ‘చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని, అదనపు సమయాల్లో విద్యార్థులను చదివిస్తున్నట్టు తెలిపారు’. త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయుల రేషన్లైజేషన్ ప్రక్రియలో హైస్కూళ్లలో పనిచేస్తున్న అదనపు ఉపాధ్యాయులను యూపీ స్కూళ్లకు, యూపీ స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్లను ప్రాథమిక పాఠశాలలకు పంపుతామన్నారు. విద్యాప్రమాణాలు సన్నగిల్లకుండా డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, వి.బాలప్రభుకుమార్, వనం నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు ఉన్నారు.