అవనిగడ్డ ఉపఎన్నిక అనివార్యం
అవనిగడ్డ ఉపఎన్నిక పోలింగ్ అనివార్యంగా మారింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది. నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. చివరకు టీడీపీ సహా ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు.
21న అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ పోటీ చేస్తున్నారు.
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. సానుభూతి కోణంలో చూసిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టలేదు.