avn Reddy
-
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్‌రెడ్డి విజయం
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్ ఫిగర్ 12,709 దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వీరిలో ఏవీఎన్‌రెడ్డి 7505 ఓట్లు (మొదటి ప్రాధాన్యత) సాధించగా, గుర్రం చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లు పొందారు. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి 4569 ఓట్లు పొందారు. మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి అతి తక్కువగా 1,236 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక హర్షవర్థన్‌రెడ్డికి 1907 ఓట్లు రాగా, భుజంగరావు 1103 ఓట్లు వచ్చాయి. కాసం ప్రభాకర్‌కు 764 ఓట్లు సాధించగా, ఎ.వినయ్‌బాబు 568 ఓట్లు సాధించారు. ఎస్ విజయ్‌కుమార్ 313 ఓట్లు సాధించగా, లక్ష్మీనారాయణ 212 ఓట్లు , ఎ.సంతోష్‌కుమార్ 160 ఓట్లు, అన్వర్‌ఖాన్ 142 ఓట్లు, డి.మల్లారెడ్డి 69, ప్రొఫెసర్ నథానియ ల్ 98, మేడిశెట్టి తిరుపతి 57, జి. వెంకటేశ్వర్లు 47, చంద్రశేఖర్‌రావు 41, పార్వతి 20, కె. సత్తెన్న 6, ఎల్ వెంకటేశ్వర్లు 14 ఓట్లు పొందగా, త్రిపురారి అనంతనారాయణ్ ఒకే ఓటుతో సరి పెట్టుకున్నారు. -
రూ. కోట్లకు టోపీ పెట్టిన కేసులో.. కళానికేతన్ ఎండీ అరెస్టు
♦ రూ. 100 కోట్లకుపైగానే మోసం చేసినట్లు చెబుతున్న పోలీసులు ♦ పెట్టుబడి, అప్పుల పేరిట సొమ్ము సేకరణ ♦ ఆనక తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు ♦ ఏవీఎన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: కళానికేతన్ వస్త్ర దుకాణాల్లో పెట్టుబడుల పేరిట భారీగా సొమ్ము వసూలు చేసి, టోకరా పెట్టారంటూ నమోదైన కేసులో ఆ సంస్థ ఎండీ లీలాకుమార్, ఆయన భార్య శారదలను శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారు గత మూడేళ్లుగా పరిచయస్తులు, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేశారని... సామాన్యులు, ఇతర వ్యాపారులకు రూ. 100 కోట్ల వరకూ టోపీ పెట్టారని పోలీసులు చెబుతున్నారు. కళానికేతన్ సంస్థలకు చైర్మన్ చేస్తామంటూ రూ.3.5 కోట్లకు టోకరా పెట్టారని హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన ఏవీఎన్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ అదనపు పోలీసు కమిషనర్ విజయేందర్‌రెడ్డి వెల్లడించారు. దాని ప్రకారం.. షేక్‌పేటలో ఉండే లీలాకుమార్‌కు, పొరుగింట్లో ఉండే ఏవీఎన్ రెడ్డితో కొంతకాలంగా పరిచయం ఉంది. వ్యాపార రంగంలో బాగా ఎదగాలన్న ఆశతో ఉన్న ఏవీఎన్ రెడ్డిని లీలాకుమార్ బుట్టలో వేసుకున్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే కళానికేతన్ సంస్థల చైర్మన్‌ను చేస్తామని ఆశచూపి.. పలు దఫాలుగా రూ.మూడు కోట్లు తీసుకున్నారు. కానీ చైర్మన్‌గా చేయలేదు, ఎన్నిసార్లు అడిగినా డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. రెండు సార్లు చెక్కులిచ్చినా బౌన్స్ అయ్యాయి. దీంతో ఏవీఎన్ రెడ్డి లీలాకుమార్ దంపతులపై వారం కింద సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని శనివారం అరెస్టు చేశారు. 100 కోట్లకు టోకరా.. లీలాకుమార్ కళానికేతన్ ఎండీ కాగా, ఆయన భార్య శారద ఆ సంస్థలో ఒక డెరైక్టర్. వీరు మూడేళ్లుగా తెలిసినవారు, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేశారని... రూ.100 కోట్ల వరకు సామాన్యులను, ఇతర వ్యాపారులను ముంచారని పోలీసుల విచారణలో తేలింది. లీలాకుమార్‌ను అరెస్టు చేశారనే సమాచారం తెలుసుకున్న బాధితులు సీసీఎస్‌కు వస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. లీలాకుమార్ పెట్టుబడి పేరుతో ముందు డబ్బులు తీసుకుంటాడని, తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని.. ఎవరైనా ఒత్తిడి చేస్తే వారిపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాడని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు లీలాకుమార్‌కు పెట్టుబడి, అప్పుల రూపంలో భారీగా డబ్బులు ఇచ్చారన్నారు. కొంతమందిపై తప్పుడు కేసులు పెట్టినట్లుగా కేసుల విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. లీలాకుమార్‌పై పంజాగుట్ట పీఎస్‌లో డిసెం బర్ 30న మరో కేసు నమోదైందని.. రూ. 50 లక్షలు తీసుకుని తనకు కళానికేతన్ సంస్థలో షేర్లు ఇస్తానని చెప్పి లీలాకుమార్ మోసం చేసినట్లుగా యెల్లారెడ్డిగూడకు చెందిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఇక కళానికేతన్ వస్త్ర దుకాణాలను రాత్రికి రాత్రే మూసేసి భవన యజమానులకు అద్దె ఇవ్వకుండా మోసం చేశాడని.. అలాంటి వారు కూడా సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.