రూ. కోట్లకు టోపీ పెట్టిన కేసులో.. కళానికేతన్ ఎండీ అరెస్టు | kalanikethan md arrest | Sakshi
Sakshi News home page

రూ. కోట్లకు టోపీ పెట్టిన కేసులో.. కళానికేతన్ ఎండీ అరెస్టు

Published Sun, Jan 10 2016 5:05 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

kalanikethan md arrest

రూ. 100 కోట్లకుపైగానే మోసం చేసినట్లు చెబుతున్న పోలీసులు
పెట్టుబడి, అప్పుల పేరిట సొమ్ము సేకరణ
ఆనక తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు
ఏవీఎన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు

 సాక్షి, హైదరాబాద్: కళానికేతన్ వస్త్ర దుకాణాల్లో పెట్టుబడుల పేరిట భారీగా సొమ్ము వసూలు చేసి, టోకరా పెట్టారంటూ నమోదైన కేసులో ఆ సంస్థ ఎండీ లీలాకుమార్, ఆయన భార్య శారదలను శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారు గత మూడేళ్లుగా పరిచయస్తులు, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేశారని... సామాన్యులు, ఇతర వ్యాపారులకు రూ. 100 కోట్ల వరకూ టోపీ పెట్టారని పోలీసులు చెబుతున్నారు.
 
  కళానికేతన్ సంస్థలకు చైర్మన్ చేస్తామంటూ రూ.3.5 కోట్లకు టోకరా పెట్టారని హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన ఏవీఎన్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ అదనపు పోలీసు కమిషనర్ విజయేందర్‌రెడ్డి వెల్లడించారు. దాని ప్రకారం.. షేక్‌పేటలో ఉండే లీలాకుమార్‌కు, పొరుగింట్లో ఉండే ఏవీఎన్ రెడ్డితో కొంతకాలంగా పరిచయం ఉంది. వ్యాపార రంగంలో బాగా ఎదగాలన్న ఆశతో ఉన్న ఏవీఎన్ రెడ్డిని లీలాకుమార్ బుట్టలో వేసుకున్నారు.
 
 తమ సంస్థలో పెట్టుబడులు పెడితే కళానికేతన్ సంస్థల చైర్మన్‌ను చేస్తామని ఆశచూపి.. పలు దఫాలుగా రూ.మూడు కోట్లు తీసుకున్నారు. కానీ చైర్మన్‌గా చేయలేదు, ఎన్నిసార్లు అడిగినా డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. రెండు సార్లు చెక్కులిచ్చినా బౌన్స్ అయ్యాయి. దీంతో ఏవీఎన్ రెడ్డి లీలాకుమార్ దంపతులపై వారం కింద సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని శనివారం అరెస్టు చేశారు.
 
 100 కోట్లకు టోకరా..
 లీలాకుమార్ కళానికేతన్ ఎండీ కాగా, ఆయన భార్య శారద ఆ సంస్థలో ఒక డెరైక్టర్. వీరు మూడేళ్లుగా తెలిసినవారు, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేశారని... రూ.100 కోట్ల వరకు సామాన్యులను, ఇతర వ్యాపారులను ముంచారని పోలీసుల విచారణలో తేలింది. లీలాకుమార్‌ను అరెస్టు చేశారనే సమాచారం తెలుసుకున్న బాధితులు సీసీఎస్‌కు వస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. లీలాకుమార్ పెట్టుబడి పేరుతో ముందు డబ్బులు తీసుకుంటాడని, తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని.. ఎవరైనా ఒత్తిడి చేస్తే వారిపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాడని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు లీలాకుమార్‌కు పెట్టుబడి, అప్పుల రూపంలో భారీగా డబ్బులు ఇచ్చారన్నారు.
 
  కొంతమందిపై తప్పుడు కేసులు పెట్టినట్లుగా కేసుల విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. లీలాకుమార్‌పై పంజాగుట్ట పీఎస్‌లో డిసెం బర్ 30న మరో కేసు నమోదైందని.. రూ. 50 లక్షలు తీసుకుని తనకు కళానికేతన్ సంస్థలో షేర్లు ఇస్తానని చెప్పి లీలాకుమార్ మోసం చేసినట్లుగా యెల్లారెడ్డిగూడకు చెందిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఇక కళానికేతన్ వస్త్ర దుకాణాలను రాత్రికి రాత్రే మూసేసి భవన యజమానులకు అద్దె ఇవ్వకుండా మోసం చేశాడని.. అలాంటి వారు కూడా సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement