Kalaniketan
-
కళానికేతన్ ఎండీ కస్టడీకి మరోసారి పిటిషన్ ?
ధర్మవరం అర్బన్ :కళానికేతన్ ఎండీ లీలాకుమార్‌ను మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పట్టణ పోలీసులు రెండోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఒకసారి పోలీస్ కస్టడీకి ఇచ్చిన కోర్టు రెండోసారి ఇచ్చేందుకు అంగీకరించలేదు. పట్టణ పోలీసులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. పోలీసులు మరోసారి ఎండీ లీలాకుమర్ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎండీ లీలాకుమార్తోపాటు ఆయన భార్య, సంస్థ డైరెక్టర్ అయిన లక్ష్మీశారద కూడా పట్టుచీరల వ్యాపారులకు డబ్బు ఎగవేత కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భార్య లక్ష్మీశారదకు 14 కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఇంకా రెండు కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎండీ లీలాకుమార్‌ను పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు పట్టణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి కస్టడీకి అప్పగిస్తే కేసులోని కీలక సమాచారాలను సేకరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కొనుగోలు చేసిన పట్టుచీరలు ఎక్కడున్నాయి, లీలాకుమార్‌కు ఏఏ బ్యాంకుల్లో ఎంత డబ్బు డిపాజిట్ ఉంది..తదితర వివరాలతోపాటు బాధితుల నుంచి కొనుగోలు చేసిన పట్టుచీరలు రికవరీ చేసేందుకు పోలీసులు చూస్తున్నారు. -
కళానికేతన్ డెరైక్టర్‌కు 20 వరకు రిమాండ్
ధర్మవరం: కళానికేతన్ డెరైక్టర్ లక్ష్మీ శారదకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి లీలావతి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను ధర్మవరం నుంచి అనంతపురంలోని జిల్లా జైలుకు తరలించారు. కళానికేత న్ యాజమాన్యం తమ వద్ద పట్టుచీరలు కొనుగోలు చేసి డబ్బు చెల్లించలేదంటూ ధర్మవరానికి చెందిన కొందరు వ్యాపారులు ఏడాది క్రితం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
‘కళానికేతన్’ వెనుక మాస్టర్‌మైండ్!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ ఎండీ లీలాకుమార్ చేసిన మోసాల వెనుక ఓ ‘మాస్టర్‌మైండ్’ ఉన్నాడా..? మోసాలు ఎలా చేయాలో సలహాలు, సూచనలు ఇస్తూ తెరవెనుక ఉండి మొత్తం కథ నడిపించింది అతనేనా..? దీనికి అవుననే అంటున్నారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు. కళానికేతన్ మోసాల వేనుక మాస్టర్‌మైండ్ ఉన్నాడని, తెరవెనుక ఉండి కథ నడిపించిన ఈ వ్యక్తినీ నిందితుల జాబితాలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. లీలాకుమార్‌తో పాటు ఆయన భార్య శారదను శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. బాధితుడిగా సీసీఎస్ తలుపుతట్టిన లీలాకుమార్ చివరకు నిందితుడిగా మారి జైలుకు వెళ్లాడని అధికారులు చెప్తున్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో పరిచయస్తులు, స్నేహితులు, ఇతర వ్యాపారులు.. ఇలా అనేక మందికి వల వేసే లీలాకుమార్.. ప్రాథమికంగా వారి స్థిరాస్తులపై హక్కులు సాధిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆపై ఈ పత్రాల ఆధారంగా వివిధ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆనక తమ ‘పార్ట్నర్స్’ను మోసం చేయడంతో పాటు కొందరికి మాత్రం భాగస్వామ్యం ఇస్తున్నట్లు కొన్ని పత్రాలనూ ఇచ్చినట్లు సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. లీలాకుమార్‌ను లోతుగా విచారించిన అధికారులు ఇలా ఇటు వ్యక్తులు, అటు బ్యాంకుల్ని ఒక్కడే మోసం చేయలేదని భావించారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా మోసం చేయడం వెనుక ఎవరో ఒకరు ఉన్నారన్న అనుమానంతో ఆరా తీశారు. ఫలితంగా ఓ వ్యక్తి వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నేరాన్ని ప్రేరేపించడం, నేరగాళ్లకు సహరించడం తదితర ఆరోపణల కింద ఈ కేసులో ఆ మాస్టర్‌మైండ్‌ను నిందితుల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. దీనికి న్యాయస్థానం అనుమతి అవసరమని యోచిస్తున్న అధికారులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఆస్తులపై హక్కు కాజేసి, బ్యాంకు రుణాలు పొందడం ద్వారానే కాక వస్త్ర సరఫరాదారుల్నీ లీలాకుమార్ మోసం చేసినట్లు సీసీఎస్ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా కళానికేతన్ సంస్థకు 21 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో విక్రయించడానికి అవసరమైన వస్త్రాలను అనేక మంది హోల్‌సేలర్లతో పాటు కంపెనీల నుంచి ఖరీదు చేస్తుంటారు. ఇలాంటి సరఫరాదారులకు లీలాకుమార్ రూ.75 కోట్ల మేర బకాయిపడినట్లు అధికారులు చెప్తున్నారు. నగరంలోని షేక్‌పేట నివాసి ఏవీఎన్ రెడ్డి తనను మోసం చేశాడంటూ లీలాకుమార్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా బాధితుడిగా వచ్చిన ఈయన అసలు వ్యవహారాన్ని దర్యాప్తు నేపథ్యంలో గుర్తించిన అధికారులు మరో కేసుతో నిందితుడిగా మార్చి అరెస్టు చేశారు. కళానికేతన్ శాఖల కోసం తమ దుకాణాలను అద్దెకు ఇచ్చిన వ్యక్తులూ సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నారు. వస్త్ర దుకాణాలను రాత్రికి రాత్రే మూసేసి అద్దె చెల్లించకుండా మోసం చేశారని వాపోతున్నారు. ఏవీఎన్ రెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. రూ.50 లక్షల మోసానికి సంబంధించి లీలాకుమార్‌పై గత నెల 30న పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన కేసునూ దర్యాప్తు నిమిత్తం స్వీకరించాలని సీసీఎస్ నిర్ణయించింది. -
రూ. కోట్లకు టోపీ పెట్టిన కేసులో.. కళానికేతన్ ఎండీ అరెస్టు
♦ రూ. 100 కోట్లకుపైగానే మోసం చేసినట్లు చెబుతున్న పోలీసులు ♦ పెట్టుబడి, అప్పుల పేరిట సొమ్ము సేకరణ ♦ ఆనక తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు ♦ ఏవీఎన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: కళానికేతన్ వస్త్ర దుకాణాల్లో పెట్టుబడుల పేరిట భారీగా సొమ్ము వసూలు చేసి, టోకరా పెట్టారంటూ నమోదైన కేసులో ఆ సంస్థ ఎండీ లీలాకుమార్, ఆయన భార్య శారదలను శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారు గత మూడేళ్లుగా పరిచయస్తులు, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేశారని... సామాన్యులు, ఇతర వ్యాపారులకు రూ. 100 కోట్ల వరకూ టోపీ పెట్టారని పోలీసులు చెబుతున్నారు. కళానికేతన్ సంస్థలకు చైర్మన్ చేస్తామంటూ రూ.3.5 కోట్లకు టోకరా పెట్టారని హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన ఏవీఎన్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ అదనపు పోలీసు కమిషనర్ విజయేందర్‌రెడ్డి వెల్లడించారు. దాని ప్రకారం.. షేక్‌పేటలో ఉండే లీలాకుమార్‌కు, పొరుగింట్లో ఉండే ఏవీఎన్ రెడ్డితో కొంతకాలంగా పరిచయం ఉంది. వ్యాపార రంగంలో బాగా ఎదగాలన్న ఆశతో ఉన్న ఏవీఎన్ రెడ్డిని లీలాకుమార్ బుట్టలో వేసుకున్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే కళానికేతన్ సంస్థల చైర్మన్‌ను చేస్తామని ఆశచూపి.. పలు దఫాలుగా రూ.మూడు కోట్లు తీసుకున్నారు. కానీ చైర్మన్‌గా చేయలేదు, ఎన్నిసార్లు అడిగినా డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. రెండు సార్లు చెక్కులిచ్చినా బౌన్స్ అయ్యాయి. దీంతో ఏవీఎన్ రెడ్డి లీలాకుమార్ దంపతులపై వారం కింద సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని శనివారం అరెస్టు చేశారు. 100 కోట్లకు టోకరా.. లీలాకుమార్ కళానికేతన్ ఎండీ కాగా, ఆయన భార్య శారద ఆ సంస్థలో ఒక డెరైక్టర్. వీరు మూడేళ్లుగా తెలిసినవారు, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేశారని... రూ.100 కోట్ల వరకు సామాన్యులను, ఇతర వ్యాపారులను ముంచారని పోలీసుల విచారణలో తేలింది. లీలాకుమార్‌ను అరెస్టు చేశారనే సమాచారం తెలుసుకున్న బాధితులు సీసీఎస్‌కు వస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. లీలాకుమార్ పెట్టుబడి పేరుతో ముందు డబ్బులు తీసుకుంటాడని, తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని.. ఎవరైనా ఒత్తిడి చేస్తే వారిపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాడని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు లీలాకుమార్‌కు పెట్టుబడి, అప్పుల రూపంలో భారీగా డబ్బులు ఇచ్చారన్నారు. కొంతమందిపై తప్పుడు కేసులు పెట్టినట్లుగా కేసుల విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. లీలాకుమార్‌పై పంజాగుట్ట పీఎస్‌లో డిసెం బర్ 30న మరో కేసు నమోదైందని.. రూ. 50 లక్షలు తీసుకుని తనకు కళానికేతన్ సంస్థలో షేర్లు ఇస్తానని చెప్పి లీలాకుమార్ మోసం చేసినట్లుగా యెల్లారెడ్డిగూడకు చెందిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఇక కళానికేతన్ వస్త్ర దుకాణాలను రాత్రికి రాత్రే మూసేసి భవన యజమానులకు అద్దె ఇవ్వకుండా మోసం చేశాడని.. అలాంటి వారు కూడా సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. -
పండుగే పండుగ
నేటి నుంచి ‘సాక్షి పండుగ సంబరాలు’ రోజూ రూ.లక్ష గెలిచే అవకాశం ఆరు కన్సొలేషన్ బహుమతులు ప్రతి రోజూ ఏడుగురు విజేతలు విజయవాడ : వినియోగదారులకు అసలైన పండుగ వచ్చేసింది. లక్షాధికారులను చేయనుంది. నగర పరిసర ప్రాంత ప్రజలను లక్షాధికారులను చేస్తున్న ‘సాక్షి పండుగ సంబరాలు’ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 6వ తేదీ వరకు రోజూ రూ.లక్ష గెలిచే అపూర్వ అవకాశాన్ని ‘సాక్షి’ ప్రజలకు అందిస్తోంది. బందరు రోడ్డులోని కళానికేతన్లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ డ్రాలో నిత్యం ఆరు కన్సొలేషన్ బహుమలు విజేతలకు అందిస్తారు. రోజూ జరిగే డ్రాలో ఏడుగురు విజేతలుగా నిలుస్తారు. ఈ సంబరాల్లో దాదాపు 105 మందిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. ఈ సంబరాలకు కళానికేతన్ షాపింగ్ మాల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా, కో-స్పాన్సర్స్‌గా సోనోవిజన్, మారుతీ సుజుకీ, మిత్రా హోండా తదితర సంస్థలు వ్యవహరిస్తున్నాయి. టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ, రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి వ్యవహరిస్తున్నాయి. మంగళవారం నుంచి జనవరి 6వ తేదీ వరకు పైన తెలిపిన ఏ షాపులో కొనుగోలు చేసి పొందిన కూపన్‌ను అక్కడే డ్రా బాక్స్‌లో వేయాలి. ఏ రోజుకు ఆ రోజు తీసే డ్రాలో గెలుపొందిన వినియోగదారులు సంతోషంగా క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలు జరుపుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు మంగళవారం సాక్షి దినపత్రిక సిటీ 3వ పేజీ చూడాలని సూచించారు. -
కర్నూలు కళానికేతన్ అదుర్స్
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్ : నగరంలోని పార్కురోడ్డులో ఉన్న మహిళల ప్రత్యేక షోరూం కళానికేతన్లో ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత గురువారం సందడి చేశారు. షోరూం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె భారీ కేక్‌ను కట్ చేశారు. రెండు, మూడు ఫ్లోర్లలో కలియ తిరిగి పట్టు చీరెలను పరిశీలించారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ కర్నూలుకు మొదటి సారి వచ్చానని, నగరం ఎంతో బాగుందని అన్నారు. సినీ పరిశ్రమలో తనను ఆదరిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కళానికేతన్ షోరూం రెండవ వార్షికోత్సవంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి వ్యయ ప్రయాసలతో చీరెలు కొనుగోలు చేసే అవసరం లేదన్నారు. కళానికేతన్లో నాణ్యమైన, ఆధునిక వస్త్రాలను అందుబాటులో పెట్టారని పేర్కొన్నారు. కళానికేతన్ షోరూం నిర్వాహకులు నీలా కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన అనతి కాలంలోనే మహిళలు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రెండో వార్షికోత్సవం సందర్భంగా మహిళామణుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. శారీస్, గాగ్రాస్, సల్వార్స్, వెస్ట్రన్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లపై భారీగా తగ్గింపు ధరలతో అన్ని వస్త్రాలు అందిస్తున్నామన్నారు. చీరెల నుండి కిడ్స్ వేర్ వరకు 50 నుండి 30 శాతం ప్లాట్ ధరలు తగ్గించామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. -
సంక్రాంతి సంబరాలను ముందే తెచ్చిన ‘సాక్షి’- కళానికేతన్
=లక్కీ డ్రా తీసిన ఉడా వీసీ = బంపర్ డ్రాలో రూ.లక్ష గెలుచుకున్న ప్రవీణ విజయవాడ, న్యూస్‌లైన్ : తెలుగునాట సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. పండుగ సంబరాలు అంబరాన్నంటుతాయి. అయితే ఈ పండుగకు 20 రోజులు ముందుగానే ‘సాక్షి’- కళానికేతన్ ప్రజలకు సంక్రాంతి ఆనందాన్ని అందిస్తున్నాయి. ‘సాక్షి’- కళానికేతన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల కార్యక్రమం 22వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కొనసాగుతుంది. 15 రోజులపాటు కొనసాగే ఈ పండుగలో ప్రతి రోజూ ఒకరిని ‘సాక్షి’ లక్షాధికారిని చేస్తుంది. అందులో భాగంగా ఎంజీ రోడ్‌లోని కళానికేతన్ షోరూమ్‌లో సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీజీటీఎమ్ ఉడా వైస్ చైర్మన్ ఎం.రామారావు హాజరై లక్కీ కూపన్లను డ్రా తీశారు. బంపర్ బహుమతి లక్ష రూపాయలను నెల్లూరు జిల్లా కావలికి చెందిన బేతు ప్రవీణ గెలుచుకున్నారు. కార్యక్రమంలో సాక్షి బ్రాంచి మేనేజర్ ఐ సూర్యనారాయణ, ఏజీఎం (యాడ్స్) వినోద్ మాదాసు, రీజనల్ మేనేజర్ (యాడ్స్) సీహెచ్ అరుణ్‌కుమార్, కళానికేతన్ హెచ్ఆర్ మేనేజర్ జీ రాము, స్టోర్ మేనేజర్ వీ దేవేంద్ర, కొనుగోలుదారులు పాల్గొన్నారు. అభినందనీయం..... ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘సాక్షి’ దినపత్రిక, ప్రజలకు విస్తృత శ్రేణిలో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న కళానికేతన్ సంయుక్తంగా సంక్రాంతి సంబరాలను ఆ పండుగకు ముందే నిర్వహిస్తూ కొనుగోలుదారులకు బహుమతులు అందించటం అభినందనీయం. సంక్రాంతి పండుగ అనగానే నూతన వస్త్రాలు కొనడం ఆనవాయితీగా వస్తుంది. కళానికేతన్ షోరూమ్ వారు వస్త్ర ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త వెరైటీస్ అందిస్తుండటం హర్షణీయం. - ఎం.రామారావు, వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్ అవకాశాన్ని వినియోగించుకోండి... ‘సాక్షి’ సంక్రాంతి సంబరాలలో మా కళానికేతన్ మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఎంజీ రోడ్‌లోని మా షోరూమ్‌లో రూ.2000 , ఆైపైబడి కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఒక లక్కీ కూపన్ అందజేస్తున్నాం. ప్రతిరోజూ సాయంత్రం ఈ లక్కీ డ్రా నిర్వహించి బంపర్ ప్రైజ్ రూ.లక్షతోపాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ, మూడు కన్సొలేషన్ బహుమతులు అందజేస్తాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతున్నాం. - చలసాని విజయకుమార్, కళానికేతన్ శిల్క్స్ డెరైక్టర్