‘కళానికేతన్’ వెనుక మాస్టర్‌మైండ్! | 'Kalaniketan' Mastermind behind! | Sakshi
Sakshi News home page

‘కళానికేతన్’ వెనుక మాస్టర్‌మైండ్!

Published Mon, Jan 11 2016 8:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

‘కళానికేతన్’ వెనుక మాస్టర్‌మైండ్!

‘కళానికేతన్’ వెనుక మాస్టర్‌మైండ్!

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ ఎండీ లీలాకుమార్ చేసిన మోసాల వెనుక ఓ ‘మాస్టర్‌మైండ్’ ఉన్నాడా..? మోసాలు ఎలా చేయాలో సలహాలు, సూచనలు ఇస్తూ తెరవెనుక ఉండి మొత్తం కథ నడిపించింది అతనేనా..? దీనికి అవుననే అంటున్నారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు. కళానికేతన్ మోసాల వేనుక మాస్టర్‌మైండ్ ఉన్నాడని, తెరవెనుక ఉండి కథ నడిపించిన ఈ వ్యక్తినీ నిందితుల జాబితాలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. లీలాకుమార్‌తో పాటు ఆయన భార్య శారదను శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.

బాధితుడిగా సీసీఎస్ తలుపుతట్టిన లీలాకుమార్ చివరకు నిందితుడిగా మారి జైలుకు వెళ్లాడని అధికారులు చెప్తున్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో పరిచయస్తులు, స్నేహితులు, ఇతర వ్యాపారులు.. ఇలా అనేక మందికి వల వేసే లీలాకుమార్.. ప్రాథమికంగా వారి స్థిరాస్తులపై హక్కులు సాధిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆపై ఈ పత్రాల ఆధారంగా వివిధ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆనక తమ ‘పార్ట్‌నర్స్’ను మోసం చేయడంతో పాటు కొందరికి మాత్రం భాగస్వామ్యం ఇస్తున్నట్లు కొన్ని పత్రాలనూ ఇచ్చినట్లు సీసీఎస్ అధికారులు చెప్తున్నారు.

లీలాకుమార్‌ను లోతుగా విచారించిన అధికారులు ఇలా ఇటు వ్యక్తులు, అటు బ్యాంకుల్ని ఒక్కడే మోసం చేయలేదని భావించారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా మోసం చేయడం వెనుక ఎవరో ఒకరు ఉన్నారన్న అనుమానంతో ఆరా తీశారు. ఫలితంగా ఓ వ్యక్తి వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నేరాన్ని ప్రేరేపించడం, నేరగాళ్లకు సహరించడం తదితర ఆరోపణల కింద ఈ కేసులో ఆ మాస్టర్‌మైండ్‌ను నిందితుల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. దీనికి న్యాయస్థానం అనుమతి అవసరమని యోచిస్తున్న అధికారులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

 ఆస్తులపై హక్కు కాజేసి, బ్యాంకు రుణాలు పొందడం ద్వారానే కాక వస్త్ర సరఫరాదారుల్నీ లీలాకుమార్ మోసం చేసినట్లు సీసీఎస్ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా కళానికేతన్ సంస్థకు 21 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో విక్రయించడానికి అవసరమైన వస్త్రాలను అనేక మంది హోల్‌సేలర్లతో పాటు కంపెనీల నుంచి ఖరీదు చేస్తుంటారు. ఇలాంటి సరఫరాదారులకు లీలాకుమార్ రూ.75 కోట్ల మేర బకాయిపడినట్లు అధికారులు చెప్తున్నారు.

నగరంలోని షేక్‌పేట నివాసి ఏవీఎన్ రెడ్డి తనను మోసం చేశాడంటూ లీలాకుమార్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా బాధితుడిగా వచ్చిన ఈయన అసలు వ్యవహారాన్ని దర్యాప్తు నేపథ్యంలో గుర్తించిన అధికారులు మరో కేసుతో నిందితుడిగా మార్చి అరెస్టు చేశారు. కళానికేతన్ శాఖల కోసం తమ దుకాణాలను అద్దెకు ఇచ్చిన వ్యక్తులూ సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నారు.

వస్త్ర దుకాణాలను రాత్రికి రాత్రే మూసేసి అద్దె చెల్లించకుండా మోసం చేశారని వాపోతున్నారు. ఏవీఎన్ రెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. రూ.50 లక్షల మోసానికి సంబంధించి లీలాకుమార్‌పై గత నెల 30న పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసునూ దర్యాప్తు నిమిత్తం స్వీకరించాలని సీసీఎస్ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement