Ayonika Paul
-
ఒత్తిడిని అధిగమిస్తా: అయోనికా పాల్
ముంబై: త్వరలో జరిగే రియో ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్నట్లు భారత షూటర్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) అయోనికా పాల్ తెలిపింది. దీనిలోభాగంగానే తన సాంకేతికతకు మెరుగులు దిద్దుతున్నట్లు అయోనికా వెల్లడించింది. పలు దేశాల నుంచి పాల్గొనే ఆ మెగా ఈవెంట్లో ఒత్తిడి అధికంగా ఉంటుందని, అయితే దాన్ని అధిగమిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. 'రియోకు కచ్చితమైన ప్రణాళికలతో సిద్ధమవుతున్నా. చదవడానికి ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానో, అదే రకంగా రియోకు సన్నద్ధమవుతున్నా. నాకున్న కొద్దిపాటి అనుభవంతో ఒత్తిడిని అధిగమిస్తా. నాకు సాధారణంగా ఒత్తిడిలో ఆడటమంటే ఇష్టం. అంతకుముందు కూడా ఇదే తరహాలో ఒత్తిడిని జయించా. ప్రస్తుతం నా టెక్నిక్కు సానబడుతున్నాను' అని అయోనికా స్పష్టం చేసింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ రౌండ్లో అయోనికా రజతం సాధించి రియోకు అర్హత పొందింది. 2014 లో గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా అయోనికా రజతంతో మెరిసిన సంగతి తెలిసిందే. -
అయోనికాకు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ భారత షూటర్ల గురి అదిరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అయోనికా పాల్ కాంస్య పతకం సాధించగా... అయోనికా పాల్, అపూర్వీ చండీలా, పూజా ఘాట్కర్లతో కూడిన భారత జట్టుకు టీమ్ ఈవెంట్లో (1241.4 పాయింట్లు) రజత పతకం లభించింది. వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి అయోనికా, అపూర్వీ, పూజా ఫైనల్‌కు చేరుకోగా... అయోనికా 185 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అపూర్వీ ఎనిమిదో స్థానంతో, పూజా ఐదో స్థానంతో సంతృప్తి పడ్డారు. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆశి రస్తోగి స్వర్ణం, ప్రాచీ గడ్కరీ కాంస్యం నెగ్గగా... జూనియర్ విభాగంలో శ్రీయాంక సాదంగి కాంస్య పతకం సొంతం చేసుకుంది. -
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇక్కడ సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత్ కు చెందిన అయోనికా పౌల్ కాంస్య పతకాన్ని సాధించింది. భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా పతకం సాధించడంలో విఫలమైనా. . అయోనికా 185.0 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇదే విభాగంలో సింగపూర్ కు చెందిన సెర్ జియాన్ 208 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. ఇదిలా ఉండగా మహిళల 10 మీటర్ల జూనియర్ల విభాగంలో భారత షూటర్ శ్రీయాంక సదాంగి కాంస్యాన్ని సాధించింది. ఆదివారం జరిగిన 10మీటర్ల పురుషుల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా రెండు పసిడి పతకాలు సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన బింద్రా.. గగన్ నారంగ్, చెయిన్ సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో కూడా పసిడిని సాధించాడు.