అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తా
-సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అయ్యగారిపాళెం(పొదలకూరు) : ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై ప్రజావాణి వినిపిస్తానని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అయ్యగారిపాళెంలో గురువారం జరిగిన శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే చుట్టుపక్కల గ్రామాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటేసీ గెలిపించిన వారి రుణం తీర్చుకుంటానన్నారు. అయ్యగారిపాళెం గ్రామస్తులు తమ కుటుంబాన్ని వెన్నంటి ఉన్నారన్నారు. ఏకపక్షంగా ఎన్నికల్లో ఓట్లేసి తనను గెలిపించినట్టు పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్‌గా తాను పనిచేసిన కాలంలో అయ్యగారిపాళెంలో మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.
ప్రజానాయకులు అన్నవారు రాగద్వేషాలను జయించాలన్నారు. ఓటమికి కుంగిపోవడం, గెలుపునకు పొంగిపోవడం మంచిపద్ధతి కాదన్నారు. కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడితే ప్రజాజీవితం నుంచి ప్రజలే వెలివేస్తారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలు తాత్కాలికమని, చేసిన అభివృద్ధే నాయకుడి పనితనానికి ప్రామాణికంగా పనిచేస్తాయన్నారు.
అందరినీ కలుపుకుని వెళుతూ కక్షపూరిత రాజకీయాలకతీతంగా పనిచేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ కట్టా సులోచన, తోడేరు ఎంపీటీసీ సభ్యుడు ఏనుగు శశిధర్‌రెడ్డి, బిరదవోలు సర్పంచ్ వెన్నపూస శ్రీనివాసులురెడ్డి, మాజీ సర్పంచులు ఏటూరు వేణుగోపాల్‌రెడ్డి, ఎం.గోపాలయ్య, నాయకులు కండే వెంకటనర్సయ్య, రాధాకృష్ణయ్య, కట్టా పెంచలభాస్కర్, కోసూరు సుబ్రమణ్యం, గోగుల గోపాలయ్య ఉన్నారు.