ayyavaripalli
-
చికిత్స పొందుతూ మహిళ మృతి
రాప్తాడు : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కవిత (26) అనే మహిళ మృతి చెందింది. వివరాలు అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గుంజర ఎర్రిస్వామి, కవిత దంపతులు. వ్యక్తి గత పని నిమిత్తం బుధవారం ద్విచక్రవాహనంలో అనంతపురానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాప్తాడు మీదుగా అయ్యవారిపల్లికి బయలుదేరారు. అయ్యవారిపల్లి సమీపంలో రాప్తాడు చెరువులోకి వెళ్లే కాలువ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కవిత తలకు గాయమైంది. వెంటనే అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వారికి కుమారుడు, కుమారై ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు. -
వైభవంగా ఎర్రితాతస్వామి ఉట్ల పరుష
రాప్తాడు : మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎర్రితాత స్వామి ఉట్లపరుష సోమవారంతో ముగిసింది. ఆలయంలో తెల్లవారుజామునే ఎర్రితాత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పరుషకు కనగానపల్లి, ఆత్మకూరు, అనంతపురం, ధర్మవరం తదితర మండలాల నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి, మొక్కులను తీర్చుకున్నారు. ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద సందడి నెలకొంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు : ఎర్రితాత స్వామి ఉట్లపరుషను అయ్యవారిపల్లి గ్రామస్తులు, భక్తులు ఆలయంలో వినాయకుడు, శ్రీరాముడు, ఎర్రితాతస్వామి, గోటుకూరుప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మాయలా(లే)డి టీచర్
విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించాల్సిన ఉపాధ్యాయురాలు, వారిని దొంగతనాలు చేయాలని ప్రోత్సహిస్తోందని అయ్యవారిపల్లికి చెందిన ప్రజలు ఆరోపించారు. సోమవారం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని అయ్యవారిపల్లె పాఠశాలలో షమీంబీ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అదే పాఠశాలలో స్థానికులైన తిప్పన్న, పుష్పవతి దంపతుల కూతురు మహాలక్ష్మి 3వ తరగతి చదువుతోంది. నాలుగు రోజుల క్రితం తిప్పన్న జేబులో నుంచి రూ.1180 మాయమైంది. ప్రతి రోజూ ఒకటి రెండు రూపాయలతో తినుబండారాలు కొనుగోలు చేసే మహాలక్ష్మి వద్ద రెండు రోజులుగా పది రూపాయల నోట్లు కనిపించడంతో వారి ఇంటి సమీపంలోని దుకాణదారు ఆ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేశాడు. దీంతో అతను కూతురిని నిలదీయగా, తమ టీచర్ చెప్పడం వల్లే జేబులోని డబ్బు తీసుకెళ్లి ఇచ్చినట్లు సమాధానమిచ్చింది. అందులోంచి తనకు రూ. 80 ఇచ్చిందని తెలిపింది. దీంతో వారు రూ.500 నోటుపై సంతకం చేసి కూతురుకు ఇచ్చి పంపారు. సోమవారం టీచర్ షమీంబీ యథా ప్రకారం ఎవరెవరు ఏమేం తీసుకువచ్చారంటూ విద్యార్థులను పరిశీలించింది. మహాలక్ష్మి వద్ద ఉన్న రూ.500 తీసుకుని తన పర్సులో వేసుకుంది. అంతలో మహాలక్ష్మి తల్లిదండ్రులు, స్థానికులతో కలసి పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీశారు. ఆమె పర్సు తీసుకుని పరిశీలించగా అందులో సంతకం చేసిన రూ.500 నోటు లభించింది. ఇదెక్కడిదని ప్రశ్నించగా, దారిలో దొరికిందంటూ మహా లక్ష్మే తనకు ఇచ్చిందని టీచర్ బుకాయించింది. ఈ సమాధానంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రధానోపాధ్యాయుడు రుద్రమ నాయక్ కలుగజేసుకుని సర్దిచెప్పాడు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశాడు. ఈ విషయమై మండల విద్యాధికారి కే.వేణుగోపాల్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణగా కోరగా ఈ సమస్య తన దృష్టికి వచ్చిం దని, విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.