విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించాల్సిన ఉపాధ్యాయురాలు, వారిని దొంగతనాలు చేయాలని ప్రోత్సహిస్తోందని అయ్యవారిపల్లికి చెందిన ప్రజలు ఆరోపించారు. సోమవారం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని అయ్యవారిపల్లె పాఠశాలలో షమీంబీ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
అదే పాఠశాలలో స్థానికులైన తిప్పన్న, పుష్పవతి దంపతుల కూతురు మహాలక్ష్మి 3వ తరగతి చదువుతోంది. నాలుగు రోజుల క్రితం తిప్పన్న జేబులో నుంచి రూ.1180 మాయమైంది. ప్రతి రోజూ ఒకటి రెండు రూపాయలతో తినుబండారాలు కొనుగోలు చేసే మహాలక్ష్మి వద్ద రెండు రోజులుగా పది రూపాయల నోట్లు కనిపించడంతో వారి ఇంటి సమీపంలోని దుకాణదారు ఆ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేశాడు. దీంతో అతను కూతురిని నిలదీయగా, తమ టీచర్ చెప్పడం వల్లే జేబులోని డబ్బు తీసుకెళ్లి ఇచ్చినట్లు సమాధానమిచ్చింది.
అందులోంచి తనకు రూ. 80 ఇచ్చిందని తెలిపింది. దీంతో వారు రూ.500 నోటుపై సంతకం చేసి కూతురుకు ఇచ్చి పంపారు. సోమవారం టీచర్ షమీంబీ యథా ప్రకారం ఎవరెవరు ఏమేం తీసుకువచ్చారంటూ విద్యార్థులను పరిశీలించింది. మహాలక్ష్మి వద్ద ఉన్న రూ.500 తీసుకుని తన పర్సులో వేసుకుంది. అంతలో మహాలక్ష్మి తల్లిదండ్రులు, స్థానికులతో కలసి పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీశారు. ఆమె పర్సు తీసుకుని పరిశీలించగా అందులో సంతకం చేసిన రూ.500 నోటు లభించింది.
ఇదెక్కడిదని ప్రశ్నించగా, దారిలో దొరికిందంటూ మహా లక్ష్మే తనకు ఇచ్చిందని టీచర్ బుకాయించింది. ఈ సమాధానంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రధానోపాధ్యాయుడు రుద్రమ నాయక్ కలుగజేసుకుని సర్దిచెప్పాడు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశాడు. ఈ విషయమై మండల విద్యాధికారి కే.వేణుగోపాల్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణగా కోరగా ఈ సమస్య తన దృష్టికి వచ్చిం దని, విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.