Babli trial
-
చంద్రబాబు కోర్టుకు రావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: బాబ్లీ వివాదానికి సంబంధించి దాఖలైన కేసులో మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కెదురైంది. ఈ కేసులో చంద్రబాబుపై జారీ చేసిన వారంట్‌ను రద్దు చేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం ఆయన వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ రీకాల్‌ను కోరుతూ శుక్రవారం టీడీపీ న్యాయవాదులు చేసిన అభ్యర్థనను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు తప్పనిసరిగా న్యాయస్థానం ఎదుట హాజరై తీరాల్సిందేనని పేర్కొంది. ముఖ్యమంత్రైనా, సామాన్యుడైనా చట్టం ముందు ఒక్కటేనని, కోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను అక్టోబర్ 15వతేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు కావాలంటే సర్టిఫైడ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ న్యాయవాదులకు సూచించింది. ఎన్‌బీడబ్లు్యల ఉపసంహరణ: ఇదే కేసులో శుక్రవారం కోర్టు ముందు హాజరైన తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్‌గౌడ్‌లు దాఖలు చేసుకున్న వారెంట్ రీకాల్‌కు పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో కోర్టు ముందు హాజరుకానందుకు వారికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. మాకు ఇప్పటి వరకు నోటీసులే రాలేదు టీడీపీ న్యాయవాది సుబ్బారావు మాట్లాడుతూ మీడియా ద్వారా చంద్రబాబు, మరికొంత మందికి వ్యతిరేకంగా కేసు ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు మీడియా ద్వారానే తెలిసిందని చెప్పారు. ‘కోర్టు చంద్రబాబుకు వారెంట్ ఇవ్వడం జరగలేదు. దాని అమలు కూడా జరగలేదు. కేసు పేపర్లు కూడా ఇవ్వలేదు. ఎవరో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ తీసుకొచ్చారు. అవి మరాఠీలో ఉన్నాయి. అసలు మాపై ఆరోపణలు ఏమిటో, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో కూడా మాకు తెలియదు’అని తెలిపారు. -
డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు
సాక్షి, విజయవాడ: బ్యాంకులు దోచేసిన వారిని విదేశాలకు పంపేసి, బాబ్లీ కేసులో తనపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. బాబ్లీ కేసులో తమకు సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చెబుతున్నారని, ప్రస్తుతం మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ ఏ పార్టీ ప్రభుత్వం ఉందని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని వరద ముంపు నుంచి రక్షించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని విజయవాడ సమీపంలోని సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపు వద్ద సీఎం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబ్లీ విషయంలో తనకు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఐదు నదులు అనుసంధానం చేస్తా ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదుల్ని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న నదుల్ని కలిపి రాష్ట్రానికి నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 ప్రాజెక్టులు పూర్తి చేశామని, ఐదేళ్ల కాలంలో 45 ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా సాగుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కోండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా రాజధాని ప్రాంతం వరద ముంపునకు గురికాకుండా కాపాడామని చెప్పారు. 22వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఇబ్బంది లేకుండా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం డిజైన్ చేశామని తెలిపారు. -
కేసులకు భయపడను!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తాను కేసులకు భయపడనని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసును తిరగదోడి అరెస్టు వారెంటు పంపించారని అన్నారు. తాను తగ్గి అడిగినా ప్రధాని మోదీ కనికరం చూపించలేదని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు శనివారం మధ్యాహ్నం వచ్చారు. తమ్మినాయుడుపేటలో నాగావళి నది వద్ద జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పాత కుడి, ఎడమ కాలువల ఆధునీకరణకు రూ.195 కోట్లతో తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే టెక్కలి నియోజకవర్గంలో రూ. 23 కోట్లతో చిన్నసాన ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జిల్లాల కన్నా శ్రీకాకుళాన్ని బ్రహ్మాండమైన జిల్లాగా చేయడానికి పంతం పడతానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆఖరి బడ్జెట్ వరకూ చూసి ఇక లాభం లేదనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడో అవినీతి పార్టీ ఉందని, ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బయటకొచ్చి తనను తిడుతున్నారన్నారు. రాజధానికి, సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని వారికి ఎవరు చెప్పారన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరిస్తామని టీడీపీలోకి వస్తే, ప్రతిపక్షం అసెంబ్లీకి కూడా రావట్లేదని చెప్పారు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమో తనకు అర్థం కాలేదన్నారు. ‘బాబ్లీ ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో అక్కడికి వెళ్లాను. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారు. కేసులు పెట్టబోమన్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు అరెస్టు వారెంటు పంపించారు. ఇదేమి కుట్ర. కేంద్రానికి నేనెందుకు భయపడాలి. బానిసలమా? పౌరులం కాదా? పన్నులు కట్టలేదా?’ అంటూ ప్రశ్నించారు. -
ఇది చంద్రబాబు మరో నాటకం
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద సెక్షన్ 144ను ఉల్లంఘించి డ్రామా నడిపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ కేసులో 22 సార్లు నోటీసులు వచ్చినా స్వీకరించకుండా కేసు తీవ్రమయ్యేలా చేసి మరో నాటకానికి తెరలేపారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు బాబ్లీకి వెళ్లి నాటకం ఆడారు. ఇప్పుడు చంద్రబాబుతో స్నేహంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహారాష్ట్రలో అధికారంలో ఉంది. పోరాటం పేరుతో డ్రామా చేయడానికి అప్పుడు ప్రయత్నించారు. చంద్రబాబు తనపై కేసులు రాకుండా అన్నిరకాల తంత్రాలు చేస్తూనే ఉంటారు. ఓటుకు కోట్లు కేసులోనూ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. ఆయనపై ఉన్న కేసులన్నింటిలో స్టేలు ఉన్నాయి తప్ప పురోగతి లేదు. మీ మిత్రులు (కాంగ్రెస్) పెట్టిన కేసే ఇది. దీనికి, బీజేపీ ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదు. ప్రజలే మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపేయాలని ప్రజలే నిర్ణయించారు. మీరే కల్పించుకుని దొంగ సానుభూతి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవం కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా, ముఖ్యమంత్రి అయినా న్యాయవ్యవస్థ ముందు తలవంచకతప్పదు. మీరు నోటీసులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది. నిజంగా మీకేమైనా నోటీసులు వస్తే మీ అవినీతిపైనే.. మీరు చేసే దొంగనాటకాలపైన కాదు. మీకు నిజాయతీ ఉంటే పీడీ అకౌంట్ల విషయంలో సీబీఐ విచారణకు ఒప్పుకోవాలి. మీ అవినీతి బాగోతం బయటపడుతుంది. అవినీతిలో కూరుకుపోయిన మీ ప్రభుత్వం ప్రజాగ్రహం చవిచూడక తప్పదు. నోటీసులు వస్తాయని మీరు ముందస్తుగా>నే డప్పు కొట్టుకున్నారు.. వాటిపై ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. మీకు ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. 2016 నుంచి 22 నోటీసులు ఇస్తే మీకు తెలియదా? 22 నోటీసులు ఇచ్చినా మీకు అందలేదంటే ఆశ్చర్యంగా ఉంది. కేసు తీవ్రమయ్యేలా చేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. -
బాబ్లీ కేసు విచారణ రెండు వారాలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో తెలంగాణకు చోటివ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించింది. బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో ఇప్పటివరకు సభ్యులుగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), మహా రాష్ట్ర, ఏపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు ప్రతినిధులున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణను అందులో చేర్చాలని కోరుతూ కేంద్రం ఈ పిటిషన్ వేసింది. ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్నందున ఏపీకి చోటు కల్పించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఇదివరకే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. అయితే తమకు కూడా స్థానం కొనసాగించాలని ఏపీ కోర్టును అభ్యర్థించింది. ఏపీ తరఫు న్యాయవాది హాజరు కాకపోవడంతో ధర్మాసనం కేసును వాయిదా వేసింది.