
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద సెక్షన్ 144ను ఉల్లంఘించి డ్రామా నడిపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ కేసులో 22 సార్లు నోటీసులు వచ్చినా స్వీకరించకుండా కేసు తీవ్రమయ్యేలా చేసి మరో నాటకానికి తెరలేపారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు బాబ్లీకి వెళ్లి నాటకం ఆడారు. ఇప్పుడు చంద్రబాబుతో స్నేహంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహారాష్ట్రలో అధికారంలో ఉంది. పోరాటం పేరుతో డ్రామా చేయడానికి అప్పుడు ప్రయత్నించారు. చంద్రబాబు తనపై కేసులు రాకుండా అన్నిరకాల తంత్రాలు చేస్తూనే ఉంటారు. ఓటుకు కోట్లు కేసులోనూ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు.
ఆయనపై ఉన్న కేసులన్నింటిలో స్టేలు ఉన్నాయి తప్ప పురోగతి లేదు. మీ మిత్రులు (కాంగ్రెస్) పెట్టిన కేసే ఇది. దీనికి, బీజేపీ ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదు. ప్రజలే మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపేయాలని ప్రజలే నిర్ణయించారు. మీరే కల్పించుకుని దొంగ సానుభూతి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవం కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా, ముఖ్యమంత్రి అయినా న్యాయవ్యవస్థ ముందు తలవంచకతప్పదు. మీరు నోటీసులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది.
నిజంగా మీకేమైనా నోటీసులు వస్తే మీ అవినీతిపైనే.. మీరు చేసే దొంగనాటకాలపైన కాదు. మీకు నిజాయతీ ఉంటే పీడీ అకౌంట్ల విషయంలో సీబీఐ విచారణకు ఒప్పుకోవాలి. మీ అవినీతి బాగోతం బయటపడుతుంది. అవినీతిలో కూరుకుపోయిన మీ ప్రభుత్వం ప్రజాగ్రహం చవిచూడక తప్పదు. నోటీసులు వస్తాయని మీరు ముందస్తుగా>నే డప్పు కొట్టుకున్నారు.. వాటిపై ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. మీకు ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. 2016 నుంచి 22 నోటీసులు ఇస్తే మీకు తెలియదా? 22 నోటీసులు ఇచ్చినా మీకు అందలేదంటే ఆశ్చర్యంగా ఉంది. కేసు తీవ్రమయ్యేలా చేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment