
సాక్షి, హైదరాబాద్: బాబ్లీ వివాదానికి సంబంధించి దాఖలైన కేసులో మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కెదురైంది. ఈ కేసులో చంద్రబాబుపై జారీ చేసిన వారంట్‌ను రద్దు చేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం ఆయన వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ రీకాల్‌ను కోరుతూ శుక్రవారం టీడీపీ న్యాయవాదులు చేసిన అభ్యర్థనను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు తప్పనిసరిగా న్యాయస్థానం ఎదుట హాజరై తీరాల్సిందేనని పేర్కొంది. ముఖ్యమంత్రైనా, సామాన్యుడైనా చట్టం ముందు ఒక్కటేనని, కోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను అక్టోబర్ 15వతేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు కావాలంటే సర్టిఫైడ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ న్యాయవాదులకు సూచించింది.
ఎన్‌బీడబ్లు్యల ఉపసంహరణ: ఇదే కేసులో శుక్రవారం కోర్టు ముందు హాజరైన తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్‌గౌడ్‌లు దాఖలు చేసుకున్న వారెంట్ రీకాల్‌కు పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో కోర్టు ముందు హాజరుకానందుకు వారికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.
మాకు ఇప్పటి వరకు నోటీసులే రాలేదు
టీడీపీ న్యాయవాది సుబ్బారావు మాట్లాడుతూ మీడియా ద్వారా చంద్రబాబు, మరికొంత మందికి వ్యతిరేకంగా కేసు ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు మీడియా ద్వారానే తెలిసిందని చెప్పారు. ‘కోర్టు చంద్రబాబుకు వారెంట్ ఇవ్వడం జరగలేదు. దాని అమలు కూడా జరగలేదు. కేసు పేపర్లు కూడా ఇవ్వలేదు. ఎవరో ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్ తీసుకొచ్చారు. అవి మరాఠీలో ఉన్నాయి. అసలు మాపై ఆరోపణలు ఏమిటో, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో కూడా మాకు తెలియదు’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment