Babri Masjid demolition site
-
అయోధ్యలో పటిష్ట భద్రత
అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత దినం (డిసెంబర్ 6) సమీపిస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని ప్రజలు ప్రదర్శిస్తారని భావిస్తున్నట్లు అయోధ్య డిప్యూటీ కలెక్టర్ అనూజ్ ఝా చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం రోజున కొందరు ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయోధ్యను నాలుగు విభాగాలుగా విభజించి భద్రతా బలగాలను మోహరించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయోధ్య జిల్లాలో డిసెంబర్ 28 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
అయోధ్యలో రాహుల్ రోడ్ షో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా శుక్రవారం అయోధ్యలో రోడ్ షో చేపట్టారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన ప్రదేశానికి కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో హనుమాన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో రాహుల్ ‘కిసాన్ యాత్ర’ చేపట్టారు. 24 ఏళ్ల తర్వాత నెహ్రు-గాంధీ కుటుంబానికి చెందిన నాయకుడు ఇక్కడ పర్యటించడం విశేషం. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత నెహ్రు-గాంధీ కుటుంబ సభ్యులు అయోధ్యలో పర్యటించడం ఇదే మొదటిసారి. 1990లో రాజీవ్ గాంధీ ఇక్కడ పర్యటించారు. తర్వాత నెహ్రు-గాంధీ కుటుంబ సభ్యులు అయోధ్యకు రాలేదు. 2014 ఎన్నికల సమయంలో అయోధ్యకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైజాబాద్ లో సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడకు సమీపంలోని సుల్తాన్ పూర్ లోక్సభ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ కూడా పలుమార్లు అయోధ్యలో బీజేపీ ర్యాలీలకు గైర్హాజరయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రైతులతో ఖాట్ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.