అయోధ్యలో రాహుల్ రోడ్ షో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా శుక్రవారం అయోధ్యలో రోడ్ షో చేపట్టారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన ప్రదేశానికి కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో హనుమాన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో రాహుల్ ‘కిసాన్ యాత్ర’ చేపట్టారు. 24 ఏళ్ల తర్వాత నెహ్రు-గాంధీ కుటుంబానికి చెందిన నాయకుడు ఇక్కడ పర్యటించడం విశేషం. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత నెహ్రు-గాంధీ కుటుంబ సభ్యులు అయోధ్యలో పర్యటించడం ఇదే మొదటిసారి.
1990లో రాజీవ్ గాంధీ ఇక్కడ పర్యటించారు. తర్వాత నెహ్రు-గాంధీ కుటుంబ సభ్యులు అయోధ్యకు రాలేదు. 2014 ఎన్నికల సమయంలో అయోధ్యకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైజాబాద్ లో సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడకు సమీపంలోని సుల్తాన్ పూర్ లోక్సభ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ కూడా పలుమార్లు అయోధ్యలో బీజేపీ ర్యాలీలకు గైర్హాజరయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రైతులతో ఖాట్ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.