సంకల్ప బలంతో...
ఉపాధ్యాయుల కృషి భేష్
♦ సర్కారీ స్కూళ్లలో సవాలక్ష సమస్యలు..అయినా అధిగమించిముందుకు
♦ టెన్త్ సత్ఫలితాల సాధనలో వారే కీలకం
♦ కొత్త విద్యా విధానంలో పక్కా బోధన
♦ వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని చదివించిన టీచర్లు
♦ సమస్యలు పరిష్కరించి సదుపాయాలు కల్పిస్తే మరింత మెరుగ్గా ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పెచ్చులు ఊడిపడే పైకప్పులు.. బీటలు వారిన గోడలు.. విరిగిన కుర్చీలు/బల్లలు.. వెక్కిరించే విద్యుత్ కొరత, ల్యాబ్‌లలో అరకొర పరికరాలు, ఎండమావి చందంగా ఇంటర్నెట్ సదుపాయం, కొన్ని చోట్ల ఏకంగా చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సిన దుస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలకు కొన్ని ఉదాహరణలు ఇవి. అయితేనేం... విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉపాధ్యాయుల దృఢ సంకల్పం ముందు అవన్నీ చిన్నబోయాయి.
సర్వ హంగులతో నడిచే ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థులకు అందే అత్యుత్తమ బోధనను సర్కారీ బడుల విద్యార్థులకు సైతం అందించాలన్న ప్రభుత్వోపాధ్యాయుల తపన ముందు సమస్యలనేవి అడ్డంకే కాలేదు. సమస్యలను అధిగమించి విజయం సాధించారు. రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఫలితాల సాధనకు కృషి చేసి భేష్ అనిపించుకున్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకను పెంచి...
విద్యార్థులు బట్టీ విధానాన్ని విడిచిపెట్టి సృజనాత్మకంగా ఆలోచించేలా ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో (సీసీఈ) కంప్యూటర్, సైన్స్ ప్రయోగాలు వంటివి ఎంతో కీలకం. ఉన్న కొద్ది మేర సదుపాయాల తో వాటిని నిర్వహించి, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచారు. విద్యార్థులు సొంతంగా ఆలోచించి పరీక్షలు రాసేలా సంసిద్ధులను చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని మరీ చదివించి అందరి మన్ననలు అందుకున్నారు.
ఇంటర్నెట్ తప్పనిసరి
ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ తప్పకుండా ఉండాలి. మారిన సిలబస్‌ను విద్యార్థులకు బోధించాలంటే ఇవి లేకుండా కష్టం. ప్రతి స్కూల్లో ఒక డిజిటల్ క్లాస్‌రూం ఉంటే ఎంతో ప్రయోజనకరం.
- ఎం. శ్రీనివాసరావు, మొగిలిచర్ల జెడ్పీ పాఠశాల, వరంగల్
గెస్ట్ టీచర్లు, విద్యా వలంటీర్లతోనే...
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల గెస్ట్ టీచర్లు, విద్యా వలంటీర్లతో నెట్టుకు రావాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేకుండా చూడాలి.
- కేవీఎన్ ఆచారి, ప్రిన్సిపల్, సర్వేల్ గురుకులం
అన్ని సబ్జెక్టులకు టీచర్లుండాలి
ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. సీసీఈ విధానంలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంటే ఇబ్బంది అవుతుంది. ప్రతి సబ్జెక్టుకు కచ్చితంగా ఉపాధ్యాయున్ని నియమించాలి. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది.
- అనుమల ప్రభాకరాచారి, బీబీనగర్
విద్యార్థులను దత్తత తీసుకున్నాం
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని గ్రూపులుగా విభజించి ఉపాధ్యాయులమంతా దత్తత తీసుకున్నాం. వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి బోధించడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. సబ్జెక్టుల వారిగా విద్యార్థులకు విశదీకరించేలా చేయడం వల్ల వంద శాతం ఫలితాలు సాధించాం.
- పి.ఝాన్సీలక్ష్మి, హెచ్ఎం భీంపల్లి
మరింత శిక్షణతో మేలు
సీసీఈపై మరింతగా శిక్షణ అవసరం. పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాలంటే భాషల్లో రీడింగ్, రైటింగ్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి.
- మండవ ఉపేందర్, స్కూల్ అసిస్టెంట్
తరగతి పరిమాణం తగ్గించాలి
మెరుగైన ఫలితాల కోసం తరగతి పరిమాణాన్ని తగ్గించాలి. ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కో తరగతికి 60-70 మంది విద్యార్థులు ఉంటారు. అంత మందికి బోధన కష్టం అవుతుంది. అందుకే ఒక సెక్షన్‌ను 20-25 మంది విద్యార్థులకే పరిమితం చేసి ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండేలా చూడాలి. అప్పుడు అన్ని పాఠశాలల్లో వంద శాతం రిజల్ట్ వస్తుంది.
- వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు
సబ్జెక్టు టీచర్లు కచ్చితంగా ఉండాల్సిందే
మన దగ్గర ఒక సబ్జెక్టు టీచర్ ఉంటే మరో సబ్జెక్టు టీచర్ ఉండట్లేదు. దీంతో పాఠశాలల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉపాధ్యాయులపై భారం పెరుగుతోంది. అందుకే టీచర్ల కొరత లేకుండా నియామకాలు చేపట్టాలి. టీచర్లకు ఇతర పనులను అప్పగించడం ఆపేయాలి.
- రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
సదుపాయాలు కల్పిస్తే ఇంకా మంచి ఫలితాలు
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తే అద్భుతమైన ఫలి తాలు వస్తాయి. గడచిన కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. అక్కడ అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి బోధనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
- ప్రొఫెసర్ హరగోపాల్
టీచర్ల కృషితోనే 100 శాతం ఫలితాలు
ఉపాధ్యాయుల కృషి వల్లే 547 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. ప్రోత్సాహం అందిస్తే మరింత బాగా పని చేస్తారు. స్కూళ్లలో సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. కొత్త విధానాలపై ఉపాధ్యాయులకు రెగ్యులర్‌గా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.
- రాజిరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు
పక్కా ప్రణాళికతో పని చేసినందునే
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. ప్రత్యామ్నాయ తరగతులను నిర్వహించారు. కాబట్టే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10/10 జీపీఏ, స్కూళ్లు వంద శాతం ఫలితాలను సాధించగలిగాయి.
- వీరాచారి, ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి
సమస్యలను అధిగమించి...
సమస్యలను అధిగమించి ప్రణాళిక ప్రకారం బోధన కొనసాగించాం. సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అన్ని సబ్జెక్టులకు టీచర్లను ఇవ్వాలి. అప్పుడే తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరుగుతుంది.
- అనంతుల కుమారస్వామి, ప్రధానోపాధ్యాయులు, తొగర్రాయి.
ఫోన్ ద్వారా సమీక్షించాం
విద్యార్థులు ఇంటి వద్ద చదవుకునేందుకు వీలుగా ప్రత్యేక టైంటేబుల్ రూపొందించాం. దీనిపై ఫోన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమీక్షించాం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యామ్నాయ తరగతులు నిర్వహించాం. గణితమంటే సులభమనే భావన కలిగించాం.
- కుర్రె సాంబయ్య, స్కూల్ అసిస్టెంట్, గణితం