జూదగాడు... జగజ్జేత
సరిగ్గా మూడేళ్ల క్రితం జపాన్ బ్యాడ్మింటన్‌కు సంబంధించి కెంటో మొమోటా అతి పెద్ద హీరో. అప్పటికే అనేక పెద్ద విజయాలతో దూసుకొచ్చిన 20 ఏళ్ల కుర్రాడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా సత్తా చాటి ఆ దేశం తరఫున సింగిల్స్‌లో పతకం (కాంస్యం) సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మరో ఏడాది తర్వాత జరిగే రియో ఒలింపిక్స్‌లో కూడా తమ దేశానికి పతకం అందించగలడని అందరూ అతనిపై ఆశలు పెంచుకున్నారు. అయితే కొన్ని నెలల్లోనే సీన్ మారిపోయింది. మొమోటా చేసిన తప్పు అతడికి ఒలింపిక్స్ అవకాశాలనే కాదు దేశంలో అభిమానులను కూడా దూరం చేసేసింది. జూదం ఆడి శిక్షకు గురైన అతను ఇప్పుడు ప్రపంచ వేదికపై విజేతగా నిలిచి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.
సాక్షి క్రీడావిభాగం : 2016 ఏప్రిల్‌లో జపాన్ బ్యాడ్మిం టన్ సమాఖ్య నిషేధం విధించే నాటికి మొమోటా అనామకుడేమీ కాదు. ఆ సమయంలో వరల్డ్ నంబర్–2గా కొనసాగుతున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాం స్యం, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ విజేత, రెండు సూపర్ సిరీస్ ప్రీమియర్, మరో సూపర్ సిరీస్ టైటిల్స్వంటి ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు మరో రెండు గ్రాండ్‌ప్రి విజయాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అంతకుముందే వరల్డ్, ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణ, కాంస్యాలు... జపాన్‌లో మొమోటా సూపర్ స్టార్‌గా మారేందుకు పునాది వేశాయి. అయితే ఆటగాడిగా ఈ ఘనతలన్నీ అతడిని కాపాడలేకపోయాయి. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాడనే నమ్మకం ఉన్నా సరే... అతని క్రమశిక్షణారాహిత్యానికి జపాన్ సమాఖ్య నిర్దాక్షిణ్యంగా శిక్ష విధించింది.
క్యాసినోకు వెళ్లి...
మరో జపాన్ సీనియర్ క్రీడాకారుడు కెనిచి టాగోతో స్నేహం మొమోటాకు చేటు చేసింది. అతనితో కలిసి బయటి సరదాలకు అలవాటు పడిన అతను వరుసగా జట్టు ప్రాక్టీస్ సెషన్లకు డుమ్మా కొట్టాడు. ఇతర ఆటగాళ్లపై ఇది ప్రతికూలం ప్రభావం చూపిస్తోందని ముందుగా హెచ్చరించిన సమాఖ్య, ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించి మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణలో మొమోటా అక్రమ క్యాసినోలకు వెళ్లి జూదమాడుతున్నట్లు తేలింది. జపాన్‌లో గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. ఫెడరేషన్ విచారణలో తాను ఆరు సార్లు జూదశాలకు వెళ్లినట్లు, మొత్తం 5 లక్షల జపాన్ యెన్లు (రూ. 3 లక్షలు) పోగొట్టుకున్నట్లు అతను చెప్పాడు. మరోవైపు ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న మొమోటాను తానే తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లానని, తనకు ఎలాంటి శిక్ష విధించినా సిద్ధం కానీ అతడిని మాత్రం క్షమించమని టాగో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అయితే జపాన్ క్రీడా మంత్రి మాత్రం ‘జూదమాడటం ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధం. అలాంటివాడికి ఒలింపిక్స్ ఆడే అర్హత లేదు’ అంటూ నిషేధం ప్రకటించడంతో మొమోటా కెరీర్ ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయింది. అతనిపై శిక్షను కూడా జపాన్ ఎంతో కొంత కాలానికే పరిమితం చేయకుండా ‘నిరవధిక నిషేధం’ అని ప్రకటించడం ఇబ్బందికరంగా మారింది.
ఏడాది తర్వాత...
ఒక వ్యక్తిగత క్రీడలో 22 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న సమయంలో ఈ తరహా ఎదురు దెబ్బ తినడం ఆ ఆటగాడిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుచూపు మేరలో ఎలాంటి భవిష్యత్తు కనిపించలేదు. అయితే ఏదోలా ధైర్యం చేసుకున్న కెంటో షటిల్‌ను మాత్రం వదలి పెట్టలేదు. దిగువ స్థాయి స్థానిక లీగ్‌లలో పాల్గొనడంతో పాటు ఎలాంటి వివాదానికి తావులేకుండా తన ఆటను కొనసాగించాడు. మరోవైపు శిక్షలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. దాంతో అతని ప్రవర్తనపై సంతృప్తి చెందిన జపాన్ ఫెడరేషన్ ఊహించని బహుమతిని అందించింది. గత ఏడాది మార్చిలో మొమోటా నిషేధం మే 15తో ముగుస్తుందని ప్రకటించింది. అంతే... ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన ఈ జపాన్ స్టార్ దూసుకుపోయాడు. ర్యాంకింగ్ 250 దాటిపోవడంతో చిన్న టోర్నీలు, క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడుతూనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌గా నిలవడం అద్భుతం. ఈ క్రమంలో గత ఏడాది కాలంలో అతను ఓడించిన ఆటగాళ్ళలో లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా), విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), కిడాంబి శ్రీకాంత్ (భారత్), టామీ సుగియార్తో (ఇండోనేసియా), సన్ వాన్ హో (దక్షిణ కొరియా), షి యుకి (చైనా)లాంటి టాప్ షట్లర్లు ఉన్నారు. పునరాగమనం తర్వాత అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, సూపర్–1000 టోర్నీ ఇండోనేసియా ఓపెన్‌ను కూడా గెలుచుకున్నాడు. కెరీర్లో అనూహ్య మలుపుల తర్వాత జగజ్జేతగా నిలిచిన మొమోటా, ఇక సొంతగడ్డపై 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తేనే తన కెరీర్‌కు సార్థకత అని ప్రకటించడం విశేషం.
కెంటో మొమోటా ప్రొఫైల్
పుట్టిన తేదీ: సెప్టెంబర్ 1, 1994
ఎత్తు: 5 అడుగుల 9 అంగుళాలు
బరువు: 68 కేజీలు; ఆడే శైలి: ఎడమచేతి వాటం
ప్రస్తుత ర్యాంక్: 7;
అత్యుత్తమ ర్యాంక్: 2 (ఏప్రిల్, 2016)
ఈ ఏడాది గెలిచిన సింగిల్స్ మ్యాచ్‌లు: 33
కెరీర్లో నెగ్గిన సింగిల్స్ మ్యాచ్‌లు: 222