Bahubhali
-
చిరంజీవి కూడా వెబ్‌సిరీస్‌లో..
‘పరుగులు లేవు. మేకప్ లూ.. పేకప్లూ లేవు. అరుపులూ.. హడావుడీ లేదు. పొల్యూషన్ లేదు. చుట్టూ నిశ్శబ్ధమే.. కుటుంబంతో మమేకమే’ అంటున్నారు సినీ నటి ఎవర్ గ్రీన్ గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ అగ్రగామి హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడారాణించి.. బాహుబలి సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ యాక్ట్రెస్ గతేడాదే వెబ్‌సిరీస్‌లో కూడా నటించారు. క్వీన్ పేరుతో రూపొందిన ఆ వెబ్‌సిరీస్ తెలుగులో డబ్ అయి జీ తెలుగు చానెల్లో ప్రసారం కానుంది. ఒక వెబ్‌సిరీస్ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం అవుతుండటం కూడా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సినిమాల్లో బిజీ బిజీ.. ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ, పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న చిత్రం, సాయిధరమ్ తేజ్ సినిమా.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తున్నా. క్వీన్ సీజన్–2 కూడా చేయాలి. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, రెండు హిందీ ప్రాజెక్టŠస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి లాక్డౌన్ తర్వాత ఏమవుతుందో..? నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏవీ ఉండవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్నవే అన్నట్టు ఉంటాయి. కాబట్టి అవే నా డ్రీమ్ రోల్స్ అనుకోవచ్చు(నవ్వుతూ)..లాక్డౌన్ నా జీవితంలో ముందెన్నడూ ఎరుగని అనుభవాన్ని ఇచ్చింది. హాయిగా ఉంది. ఇలాంటి టైమ్ లైఫ్‌లో దొరకలేదు. ఇలాంటి టైమ్ మళ్లీ దొరకదేమో కూడా.. దాదాపు రెండు నెలలైందేమో గుమ్మం దాటి. ఓ వైపు టైమంతా మన చేతుల్లోకి రావడం, ఫ్యామిలీతో మరింత టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగున్నా.. మరోవైపు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం, మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తోంది. వాళ్లంతా తమ తమ ఊర్లకు వెళ్లి.. బాగుండాలని కోరుకుంటున్నాను. ‘క్వీన్’ను ఆమెతో పోలుస్తున్నారు.. నేను నటించిన తొలి వెబ్‌సిరీస్ క్వీన్. దీని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా ప్రజ్ఞావంతులు. ఆయన స్ట్రాంగ్ స్క్రిప్తో వస్తారు. చాలా బాగా తీస్తారని తెలుసు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే చేశా. ఇక ఇందులో నా పాత్ర జయలలితను పోలినట్టు ఉందని అంటున్నారు. అది ఎవరికి తోచినట్టు వారు పోల్చుకోవచ్చు.. దానికి నేనేం చేయలేను. అనితా శివకుమారన్ రాసిన క్వీన్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా జీ తెలుగు చానెల్లో వచ్చే సోమవారం నుంచి సీరియల్‌గా అందిస్తుండటం నాకు మరింత ఆనందంగా అనిపిస్తోంది. క్వీన్ సినిమా చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ఏమీ రాలేదు. వస్తాయా? అంటే భవిష్యత్‌లో ఏమవుతుందీ చెప్పలేం కదా.. ఒత్తిడి వద్దు.. జాగ్రత్తలు వీడొద్దు.. రేపేమవుతుంది? రేపేం కాదు? అనేది తెలియడం లేదు. కంటికి కనపడని శత్రువుతో చేసే యుద్ధం కాబట్టి మానసిక ప్రశాంతతను కొంత కోల్పోతాం. ఇది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే అంటున్నారు. కాబట్టి బీ స్ట్రాంగ్, భయం, ఒత్తిడి మనల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి.. జాగ్రత్తలు పాటించండి. ఒకసారి ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ టైమ్ తప్పకుండా మెమొరబుల్ అవుతుంది. ఇలాంటి ఫ్రీ టైమ్ మళ్లీ వస్తుందా? అనిపిస్తుంది. కానీ మళ్లీ వచ్చినా ఇలాంటి కరోనా లాంటి కారణంతో కాకుండా రావాలని మాత్రం కోరుకుంటున్నా. ప్రేక్షకుల హృదయాల్లో వెబ్.. డబ్ ప్రస్తుతం వెబ్‌సిరీస్ కోసం చాలా వైవిధ్యభరితమైన ఆసక్తికరమైన కథాంశాలు ఎంచుకుంటున్నారు. దీని వల్ల నటులకు వెరైటీ రోల్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా దెబ్బకు వెబ్‌సిరీస్‌కి మరీ డిమాండ్ బాగా పెరిగింది. అయితే సినిమాలు చూడటం కోసం థియేటర్స్‌కి జనం వెళ్లడం మానేస్తారు అనను గానీ వెబ్‌సిరీస్ కూడా అదేస్థాయిలో ఆదరణ వస్తుందని చెప్పగలను. ఇకపై కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తాను. తెలుగులో చిరంజీవిలాంటి అగ్రనటులు కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారితో కాంబినేషన్‌గా నాకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఆఫర్లున్నాయి. వెబ్‌సిరీస్‌లో సాంగ్స్ ఉండవు నిజమే.. అయినా నేనిప్పుడేం సాంగ్స్ చేస్తాను చెప్పండి?(నవ్వుతూ).. సాంగ్స్కంటే వెబ్‌సిరీస్‌లో కంటెంటే పెద్ద ఆకర్షణ. -
తమన్నా మారిపోయిందా..?
సినిమా: నటి తమన్నా మారిపోయిందట. ఏమియా మార్పు? ఏ మా కథ..చూసేస్తే పోలా! గ్లామర్‌కు మారు పేరు ఈ అమ్మడు. ఆదిలో అందాలను నమ్ముకుని కథానాయకిగా ఎదిగిన నటి తమన్నా. అందాలారబోత అంటే అలా ఇలా కాదు. రెచ్చిపోవడమే. అలా ఈత దుస్తుల్లో తడి తడి అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక ఐటమ్ సాంగ్స్‌లో అయితే చెప్పనక్కర్లేదు. అదేమంటే డాన్స్ అంటే నాకిష్టం అనే సమాధానం ఈ జాణ నుంచి వస్తుంది. అయితే తమన్నాలోనూ మంచి నటి ఉంది. ఆ విషయం తమిళంలో నటించిన కల్లూరి చిత్రంలోనే నిరూపించుకున్నా, ఎందుకనో దర్శక, నిర్మాతలు తమన్నాను గ్లామర్‌కే ఎక్కువగా వాడుకుంటున్నారు. అయితే ప్రతి నటి, నటుడికి జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిపోయే చిత్రం అంటూ ఉంటుంది. అలా తమన్నా నట జీవితంలో బాహుబలి చిత్రం మరచిపోలేని చిత్రంగా గుర్తిండిపోతుంది. ఆ తరువాత ఈ అమ్మడికి సరైన పాత్ర లభించలేదనే చెప్పాలి. మళ్లీ షరా మామూలుగా గ్లామర్ పాత్రలపై మొగ్గు చూపుతూ వచ్చింది. అదే విధంగా హర్రర్ కథా చిత్రాలు తమన్నాకు వరుస కడుతున్నాయి. ఇలాంటి సమయంలో సైరాతో మరోసారి తనలోని నటిని బయటకు తీసే అవకాశం వచ్చింది. పాత్రలో సత్తా ఉండాలేగాని, నమిలేస్తా అన్నట్టుగా సైరా చిత్రంలో లక్ష్మీ పాత్రకు జీవం పోసింది తమన్నా. నిజం చెప్పాలంటే అ చిత్రంలో నయనతార కంటే తమన్నా పాత్రకే పేరు వచ్చింది. ఇక ఇటీవల తెరపైకి వచ్చిన తమిళ చిత్రం పెట్రోమ్యాక్స్ తమన్నాకు సక్సెస్‌ను అందించింది. తమన్నాలో మార్పుకు ఈ చిత్రాలేనట. ఇంతకీ ఆ మార్పు ఏమిటో చెప్పనేలేదు కదూ! ఇకపై గ్లామర్‌కు దూరంగా ఉండాలని తమన్నా నిర్ణయించుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తానంటోంది. అది సరే ఈ మిల్కీబ్యూటీ గ్లామర్‌ను ఎంజాయ్ చేసే యువత పరిస్థితి ఏమిటీ? అందాలారబోతకు దూరం అన్న తమన్నా నిర్ణయం వారిని తీరని నిరాశాపాతంగా మారుతుందే. ఏదేమైనా మంచి కుటుంబ కథా పాత్రల్లో నటించాలన్న తమన్నా ఆశను ఆహ్వానించాల్సిందే గానీ, ఈ బ్యూటీ తన మాటపై నిలబడుతుందా? ఎందుకంటే ప్రస్తుతం విశాల్‌తో నటిస్తున్న యాక్షన్ చిత్రంలో గ్లామరస్‌గానే కనిపించనుంది. ఇకపోతే పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు తన పెళ్లి గురించి చాలానే ప్రచారం అవుతోందని, అయితే అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పింది. కొందరు ఈ విషయంలో కావాలనే కల్పిత రాతలు రాస్తున్నారని, అలాంటి వాటినన్నింటిని తన వద్దకు తీసుకొస్తే, వాటిలో తానే ఒక చిత్రంగా నిర్మించడానికి సిద్ధం అని కొంచెం ఘాటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నటుడు గోపీచంద్‌కు జంటగా నటిస్తోందట. అందులో కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నట్లు తమన్నా చెప్పింది. అదే విధంగా హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ చిత్రంలో తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. -
‘బాహుబలి’ సెట్టింగ్లా అమరావతి...
-
జై మాహిష్మతి
అమరావతిపై చంద్రబాబు కొత్త ఫాంటసీ - ‘బాహుబలి’ సెట్టింగ్లా అమరావతి.. దర్శకుడు రాజమౌళితో అధికారుల చర్చలు - ఏప్రిల్ వరకు తీరిక లేకుండా ఉంటానన్న రాజమౌళి - అప్పటివరకు వేచి చూడాలని సర్కారు యోచన సాక్షి, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఇప్పటికే లెక్కలేనన్ని విన్యాసాలు చేసి, జనానికి రంగుల చిత్రాలు చూపి ఇన్నాళ్లూ ఏమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదిలో సరికొత్త ఆలోచన పురుడు పోసుకుంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’లోని మాహిష్మతి రాజ్యం సెట్టింగ్ ముఖ్యమంత్రికి విపరీతంగా నచ్చేసిందట! అందులోని సుందర కట్టడాలు, ఎత్తయిన శిల్పాలు, హంసలు విహరించే సరస్సులు ఆయన మనసు దోచేశాయట! ఇంకేముంది అమరావతిలో కూడా మాహిష్మతి సెట్టింగ్‌ల్లాంటి భవనాలే ఉండాలని ఇటీవల సీఆర్డీఏ అధికారుల సమావేశంలో సూచనలిచ్చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు నాలుగు రోజుల క్రితం దర్శకుడు రాజమౌళి ఎదుట వాలిపోయారు. రాజధానిలో భవనాల గురించి ఆయనతో చర్చించారు. బాహుబలి–2 సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం తాను తీరిక లేకుండా ఉన్నానని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాతే రాజధాని డిజైన్ల గురించి సలహాలు ఇవ్వగలనని రాజమౌళి చెప్పారు. దీంతో ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేక, వచ్చే ఏడాది వరకూ ఆయన కోసం వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జనం మెచ్చని సింగపూర్ డిజైన్లు అమరావతిలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి డిజైన్ల రూపకల్పనపై ప్రభుత్వం దోబూచులాట కొనసాగిస్తోంది. మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఖరారు విషయంలో ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా వ్యవహరిస్తోంది. 900 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు, శాసనసభ, సచివాలయం తదితర భవనాల సముదాయానికి డిజైన్లు తయారు చేయించేందుకు సంవత్సరం క్రితమే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. గతేడాది జనవరిలో మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. అనేక వడపోతల తర్వాత జపాన్ కంపెనీ ‘మకీ’కి ఆ బాధ్యతను అప్పగించింది. కానీ, ఆ కంపెనీ తయారు చేసిన ఇచ్చిన డిజైన్లు తీసికట్టుగా ఉన్నాయని ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పొగ గొట్టల్లాంటి నిర్మాణాలు విమర్శల పాలయ్యాయి. ఏపీలో అణు రియాక్టర్లు నిర్మించేందుకు సన్నాహాలు మొదలైనట్లు పొరుగు దేశం పాకిస్తాన్ పత్రికల్లో ఈ డిజైన్లపై కథనాలు రావడం గమనార్హం. దాంతో ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు మలేషియా, సింగపూర్ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరిపింది. వారు ఇచ్చిన డిజైన్లపై కూడా జనం పెదవి విరిచారు. చివరికి మళ్లీ మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్ కంపెనీని మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎంపికైన మాస్టర్ ఆర్కిటెక్ట్ 1,300 ఎకరాల్లో (పెరిగిన విస్తీర్ణంతో కలిపి) భవన సముదాయం మొత్తం డిజైన్‌తోపాటు ఐకానిక్ భవనాలుగా హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లను విడిగా రూపొందించాల్సి ఉంటుంది. ఆర్థిక, ప్రభుత్వ నగరాల డిజైన్లు రూపకల్పన బాధ్యత కూడా మాస్టర్ ఆర్కిటెక్ట్దే. ఇందుకోసం లండన్ కంపెనీ రూ.67 కోట్లు అడుగుతుండడంతో దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్కిటెక్ట్ ఎంపిక.. ఓ అంతులేని కథ నార్మన్ పోస్టర్‌ను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తూనే.. మన దేశానికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌నూ అందులో భాగస్వామిగా చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ రెండు కంపెనీలను సంయుక్తంగా మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా నియమించేందుకు ప్రాథమి కంగా అంగీకారం కుదిర్చినట్లు తెలిసింది. అయితే దీనిపై అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన నార్మన్ పోస్టర్‌కు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక అనేది అంతులేని కథలా మారిపోయింది. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా, ఎంతో సమయం వెచ్చించినా డిజైన్లకు తుదిరూపు తీసుకురాలేకపోయింది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు పూర్తయినా రాజధాని డిజైన్ల ఖరారు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు అనూహ్యంగా మాహిష్మతిని తెరపైకి తెచ్చారు. రాజధానిని సినిమా సెట్టింగ్‌లతో నింపేయాలని యోచిస్తున్నారు. అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల డిజైన్ల విషయంలో దర్శకుడు రాజమౌళి సలహాలు, సూచనలతో ముందుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.