జై మాహిష్మతి
అమరావతిపై చంద్రబాబు కొత్త ఫాంటసీ
- ‘బాహుబలి’ సెట్టింగ్‌లా అమరావతి.. దర్శకుడు రాజమౌళితో అధికారుల చర్చలు
- ఏప్రిల్ వరకు తీరిక లేకుండా ఉంటానన్న రాజమౌళి
- అప్పటివరకు వేచి చూడాలని సర్కారు యోచన
సాక్షి, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఇప్పటికే లెక్కలేనన్ని విన్యాసాలు చేసి, జనానికి రంగుల చిత్రాలు చూపి ఇన్నాళ్లూ ఏమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదిలో సరికొత్త ఆలోచన పురుడు పోసుకుంది. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’లోని మాహిష్మతి రాజ్యం సెట్టింగ్ ముఖ్యమంత్రికి విపరీతంగా నచ్చేసిందట! అందులోని సుందర కట్టడాలు, ఎత్తయిన శిల్పాలు, హంసలు విహరించే సరస్సులు ఆయన మనసు దోచేశాయట! ఇంకేముంది అమరావతిలో కూడా మాహిష్మతి సెట్టింగ్‌ల్లాంటి భవనాలే ఉండాలని ఇటీవల సీఆర్‌డీఏ అధికారుల సమావేశంలో సూచనలిచ్చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు నాలుగు రోజుల క్రితం దర్శకుడు రాజమౌళి ఎదుట వాలిపోయారు. రాజధానిలో భవనాల గురించి ఆయనతో చర్చించారు. బాహుబలి–2 సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం తాను తీరిక లేకుండా ఉన్నానని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాతే రాజధాని డిజైన్ల గురించి సలహాలు ఇవ్వగలనని రాజమౌళి చెప్పారు. దీంతో ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేక, వచ్చే ఏడాది వరకూ ఆయన కోసం వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
జనం మెచ్చని సింగపూర్ డిజైన్లు
అమరావతిలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి డిజైన్ల రూపకల్పనపై ప్రభుత్వం దోబూచులాట కొనసాగిస్తోంది. మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఖరారు విషయంలో ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా వ్యవహరిస్తోంది. 900 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు, శాసనసభ, సచివాలయం తదితర భవనాల సముదాయానికి డిజైన్లు తయారు చేయించేందుకు సంవత్సరం క్రితమే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. గతేడాది జనవరిలో మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. అనేక వడపోతల తర్వాత జపాన్ కంపెనీ ‘మకీ’కి ఆ బాధ్యతను అప్పగించింది. కానీ, ఆ కంపెనీ తయారు చేసిన ఇచ్చిన డిజైన్లు తీసికట్టుగా ఉన్నాయని ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పొగ గొట్టల్లాంటి నిర్మాణాలు విమర్శల పాలయ్యాయి. ఏపీలో అణు రియాక్టర్లు నిర్మించేందుకు సన్నాహాలు మొదలైనట్లు పొరుగు దేశం పాకిస్తాన్ పత్రికల్లో ఈ డిజైన్లపై కథనాలు రావడం గమనార్హం. దాంతో ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది.
ఆ తర్వాత కొన్నాళ్లు మలేషియా, సింగపూర్ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరిపింది. వారు ఇచ్చిన డిజైన్లపై కూడా జనం పెదవి విరిచారు. చివరికి మళ్లీ మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్ కంపెనీని మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎంపికైన మాస్టర్ ఆర్కిటెక్ట్ 1,300 ఎకరాల్లో (పెరిగిన విస్తీర్ణంతో కలిపి) భవన సముదాయం మొత్తం డిజైన్‌తోపాటు ఐకానిక్ భవనాలుగా హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లను విడిగా రూపొందించాల్సి ఉంటుంది. ఆర్థిక, ప్రభుత్వ నగరాల డిజైన్లు రూపకల్పన బాధ్యత కూడా మాస్టర్ ఆర్కిటెక్ట్‌దే. ఇందుకోసం లండన్ కంపెనీ రూ.67 కోట్లు అడుగుతుండడంతో దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు.
ఆర్కిటెక్ట్ ఎంపిక.. ఓ అంతులేని కథ
నార్మన్ పోస్టర్‌ను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తూనే.. మన దేశానికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌నూ అందులో భాగస్వామిగా చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ రెండు కంపెనీలను సంయుక్తంగా మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా నియమించేందుకు ప్రాథమి కంగా అంగీకారం కుదిర్చినట్లు తెలిసింది. అయితే దీనిపై అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన నార్మన్ పోస్టర్‌కు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక అనేది అంతులేని కథలా మారిపోయింది. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా, ఎంతో సమయం వెచ్చించినా డిజైన్లకు తుదిరూపు తీసుకురాలేకపోయింది.
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు పూర్తయినా రాజధాని డిజైన్ల ఖరారు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు అనూహ్యంగా మాహిష్మతిని తెరపైకి తెచ్చారు. రాజధానిని సినిమా సెట్టింగ్‌లతో నింపేయాలని యోచిస్తున్నారు. అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల డిజైన్ల విషయంలో దర్శకుడు రాజమౌళి సలహాలు, సూచనలతో ముందుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.