ఎన్నికల్లో డబ్బావాలా పోటీ
సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని డబ్బావాలాలు నిర్ణయించుకున్నారు. తమ తరఫున శాసనసభలో ఓ ప్రతినిధి ఉండాలనే ఉద్దేశంతో బైకల్లా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని తీర్మానించుకున్నారు. అయితే పోటీలో నిలిచే అభ్యర్థి ఎవరనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. 125 సంవత్సరాల చరి త్ర కలిగిన డబ్బావాలాలు తమదైన పనితీరుతో మేనేజ్మెంట్ గురూలుగా పేరుతెచ్చుకున్నారు.
ఆఫీసులకు టిఫిన్లు మోసేవారైనా వీరి పనితీరు ప్రముఖులను సైతం కట్టిపడేసింది. అయితే ఇప్పటిదాకా వీరి తరఫున కనీసం ఒక్కరు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో మొదటిసారి వీరు బరిలోకి దిగుతుండడంతో రాజకీయంగా ఈ విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే వీరు స్వతంత్ర అభ్యర్థులుగా కాకుండా ఓ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారనే విషయం మాత్రం స్పష్టమైంది.
డబ్బావాలాలకు చెందిన ప్రతినిధులు కొందరు శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో త్వరలో సమావేశమవుతారని కూడా చెబుతున్నారు. దీంతోడబ్బావాలాల ప్రతినిధి శివసేన నుంచే పోటీ చేయనున్నట్లు ఖరారైంది. బైకల్లా శాసనసభ నియోజకవర్గం ఆదీ నంలో బైకల్లా, ఘొడప్దేవ్, మాజ్గావ్ ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధిక శాతం మిల్లు కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం మిల్లులు మూత పడడంతో వారి వారసులు, పిల్లలు, బంధువులున్నా రు.
వీరంతా జున్నర్, అంబేగావ్, ఖేడ్ తాలూకాల కు చెందినవారు. వీరిలో చాలామంది డబ్బావాలాలుగా కొనసాగుతున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి బరిలోకి దిగితే తప్పకుండా గెలుస్తామనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి ప్రతినిధి ఒకరు తెలిపారు. శివసేన పార్టీ బైకల్లా నియోజకవర్గం టికెట్ ఇవ్వకపోతే శివ్డీ నుంచి పోటీ చేసేందుకైనా తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు.