ఫిజీ సాంకేతిక వృద్ధికి భారత్ సహకారం: మోదీ
సువా: ఫిజీ సాంకేతికతంగా మరింతగా అభివృద్ధి చెందేందుకు భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభయమిచ్చారు. ఫిజీ పార్లమెంటులో ఆయన బుధవారం ప్రసంగించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆధునికీకరణ కోసం 5 మిలియన్ డాలర్లను తక్షణ సాయంగా మోదీ ప్రకటించారు. మరో 70 మిలియన్ డాలర్లను దశలవారీగా అందిస్తామని తెలిపారు.
కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఫిజీ యువత ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఆయన అభిలాషించారు. ఫిజీలో పాడి పరిశ్రమ అభివృద్ధికి భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. కాగా అంతకు ముందు మోదీ...ఫిజీ ప్రధాని బైనీమర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిజీతో మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గత 33 ఏళ్లలో ఫిజీని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఫిజీ పర్యటన అనంతరం మోదీ స్వదేశం తిరిగి రానున్నారు.